కష్టపడి పతకం గెలిచినా.. కనీస గుర్తింపు లేదు: స్టార్ షట్లర్ అసహనం
ABN , Publish Date - May 06 , 2026 | 12:26 PM
తాము కష్టపడి థామస్ కప్‌లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, ఎన్నికల గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: డెన్మార్క్‌లో జరిగిన థామస్ కప్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. అయితే, విమాన ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ వెల్లడించాడు. తాము కష్టపడి థామస్ కప్‌లో పతకం తీసుకొచ్చినా.. కనీస గుర్తింపు లేకపోవడంపై సాత్విక్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేవలం ఐపీఎల్, రాజకీయాల గురించే జనాలు ఫోకస్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే, భవిష్యత్తులో తన పిల్లలను బ్యాడ్మింటన్ ఆడొద్దని చెప్తానంటూ సాత్విక్ వ్యాఖ్యానించాడు. విజేతలుగా స్వదేశానికి వస్తున్న తమకు కనీసం పలికేందుకు అభిమానులు కూడా రాకపోవడం బాధించిందని తెలిపాడు.
ఓ జాతీయ మీడియాతో సాత్విక్ మాట్లాడుతూ..'దాదాపు 7 గంటల పాటు ప్రయాణించి జర్మనీ నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. జర్మనీ విమానాశ్రయంలో మన భారతీయులు చాలా మందే ఉన్నారు. కొందరు తెలుగు వ్యక్తులూ ఉన్నారు. అయితే వారిలో కనీసం ఒక్కరు కూడా మీరు ఎవరు? ఆ మెడల్స్ ఏంటి? అని అడగలేదు. అప్పటికీ మేం థామస్ కప్ జెర్సీలను ధరించి ఉన్నాం. కానీ, ప్రతిఒక్కరూ ఐపీఎల్, రాజకీయాలతో బిజీగా ఉన్నారు' అని అసహనం వ్యక్తం చేశాడు.
'థామస్ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో విజయాలు సాధించినప్పుడు మనం గొప్పగా సంబరాలు చేసుకోవాల్సి ఉంది. ఇలాంటి అవకాశాలు తరచూ రావని అభిమానులకు తెలియడం లేదు. థామస్ కప్‌లో పతకం గెలవడం ఎంత కష్టమో తెలియడం లేదు. విమానాశ్రయంలో ఆ పరిస్థితి చూసి నాకు చాలా బాధేసింది. ప్రణయ్, శ్రీకాంత్, ధ్రువ్.. ఇలా జట్టులోని ప్రతిఒక్కరూ విమానాశ్రయంలో దిగగానే క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్లిపోయారు. మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. నాకోసం నా స్నేహితులు వచ్చారు. టాప్ అథ్లెట్లు కూడా క్యాబ్స్‌ను బుక్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు’ అని సాత్విక్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?
సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!