2003 ప్రపంచ కప్ టోర్నీ.. సచిన్ ఆడిన ఆ నాక్ పాక్‌కు గుర్తుండిపోద్ది!
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:50 AM
2003 మార్చి 1.. సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2003 మార్చి 1.. సచిన్‌ను క్రికెట్ దేవుడిగా మార్చిన ఓ రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన నాక్.. చరిత్రలో నిలిచిపోయింది. పాక్ కవ్వింపులు ఓ వైపు.. వారు నిర్దేశించిన భారీ లక్ష్యం మరోవైపు.. ఇవేమీ సచిన్‌కు కనపడలేదు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌పై ఉన్న కసి మాత్రమే సచిన్ ముందుంది. కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు మరీ ముఖ్యంగా షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు టీమిండియాకు మరింత కసిని పెంచాయి. భారత టాపార్డర్‌ను పేకమేడలా కూలుస్తానంటూ షోయబ్ చేసిన ప్రకటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దాన్ని తేల్చుకునేందుకు టీమిండియా బ్యాటర్లు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ కోసం నిద్ర లేని రాత్రులు గడిపానంటూ స్వయంగా సచిన్ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.
అక్తర్‌కు చుక్కలు..
వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ లాంటి భీకర పేస్ దళంతో భారత్‌పై పాక్ దాడికి దిగింది. అయితే సచిన్ మాత్రం మొదటి నుంచే దూకుడు చూపించాడు. అక్తర్ కోసమే క్రీజులో కాచుకుని ఉన్నట్లు.. అతడు బౌలింగ్‌కు రావడమే ఆలస్యం.. బౌండరీలు బాదుతూ చెలరేగిపోయాడు. మరీ ముఖ్యంగా అక్తర్ వేసిన తొలి ఓవర్‌లోనే నాలుగో బంతిని థర్డ్‌మ్యాన్ మీదుగా బాదిన ఓ భారీ సిక్స్- ఆ రోజుకే కాదు ఇప్పటికే కూడా ఐకాన్. ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్‌కు చుక్కలు కనిపించాయి. ఇక నా వల్ల కాదంటూ చేతులెత్తేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎంతలా అతడిని వణికించాడో! అదే మ్యాచ్‌లో అక్తర్ 10 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి తన కెరీర్‌లో అత్యధిక రన్స్ సమర్పించుకున్న బౌలర్‌గా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
12,000 రన్స్ మైలురాయి
సచిన్ తన ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు, ఒక సిక్స్ బాదాడు. ఓ వైపు గంగూలీ(0), సెహ్వాగ్(21) వెనువెంటనే ఔటైనా.. మహ్మద్ కైఫ్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వన్డేల్లో 12,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అక్తర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్‌కు అదొక్కటే కాస్త ఊరటనిచ్చిన అంశం. కానీ అప్పటికే పాకిస్థాన్‌కు జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. 274 పరుగుల లక్ష్యాన్ని భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.1992, 1996, 1999 వరల్డ్ కప్‌లలో పాక్‌పై సాధించిన విజయాలకు కొనసాగింపుగా 2003లోనూ భారత్ ఆధిపత్యం చాటింది. అయితే ఆ రోజును ప్రత్యేకంగా నిలబెట్టింది సచిన్ అద్భుత 98.
అదొక్కటే ఆందోళన..
ప్రస్తుతం టీమిండియా బలంగా ఉన్నప్పటికీ.. స్పిన్ బౌలింగ్‌లో కాస్త తడబడుతోంది. పాక్‌తో మ్యాచ్‌లో ప్రస్తుతం అదొక్కటే ఆందోళన. అయితే కొలంబోలోని పిచ్‌లు స్పిన్‌కే అనుకూలం. అందులోనూ పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ను మనోళ్లు ఎలా ఎదుర్కొంటారనేదే చూడాల్సి ఉంది. ఆనాటి సచిన్ ఆడిన లాంటి నాక్.. మళ్లీ పునరావృతం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్