Share News

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:34 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది.

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా హోటల్ లోపలకు వెళ్తున్న రోహిత్ శర్మ(Rohit Sharma) వద్దకు ఓ మహిళ ఒక్కసారిగా దూసుకొచ్చింది. తన కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ అభ్యర్థించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై సదరు మహిళ క్షమాపణలు తెలిపింది. ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందనే దానిపై వివరణ ఇచ్చింది.


‘నా పేరు సరితా శర్మ. నా కూతురు అనిక. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. తనను కాపాడాలంటే రూ.9కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం. దాన్ని అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంది. మేం చిన్న చిన్న శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిధులు సేకరించాం. ఇప్పటి వరకు రూ.4.1కోట్లు సమకూరాయి. మా దగ్గర ఎక్కువ సమయం లేదు. టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన క్రికెటర్లను సాయం కోసం అర్థించాలనుకున్నాం. డొనేషన్ క్యాంపు కూడా నిర్వహించాం. కానీ తగినన్నీ నిధులు సమీకరించలేకపోయాం. నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా.. నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కలవాలని అనుకున్నా. రోహిత్ శర్మ బస చేస్తోన్న హోటల్ వద్దకు వెళ్లాను. భావోద్వేగంలో నేను అతడి చేతిని లాగాను’ ఆమె వివరించారు.


‘విరాట్ సర్, రోహిత్ సర్‌లకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. నేను ఎందుకు అలా చేశానో మీకు తెలిసి ఉండకపోవచ్చు. నేను సెల్ఫీల కోసం అక్కడికి రాలేదు. నా కూతురు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో వచ్చాను. ఈ విషయంలో నేను అధికారులకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నేను విరాట్, రోహిత్‌లను నాకు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్.. నాకు సాయం చేయండి.. నా బిడ్డను కాపాడండి’ అని ఆ మహిళ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 21 , 2026 | 11:43 AM