Ro-Ko: గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:39 AM
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో అభిప్రాయభేదాలు వస్తున్నాయంటూ చర్చ జరుగుతోంది. మ్యాచ్ సమయంలోనూ వీరు ఎడముఖంగా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్(Sitanshu Kotak) స్పందించారు. న్యూజిలాండ్‌తో భారత్ రెండో వన్డే నేపథ్యంలో సితాన్షు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఖండించారు.
‘విరాట్(Virat Kohli), రోహిత్(Rohit Sharma) జట్టు ప్రణాళికల్లో భాగంగానే ఉన్నారు. ప్రస్తుతం వారు కేవలం వన్డేల్లోనే ఆడుతున్నారు. దీంతో ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. వారికి ఉన్న అనుభవాన్ని ఇతర ఆటగాళ్లతో పంచుకుంటున్నారు. ప్రతి విషయాన్ని వారిద్దరూ గంభీర్‌తో చర్చిస్తారు. సోషల్ మీడియా వచ్చే చాలా విషయాలను నేను పట్టించుకోను. కానీ జట్టులో అంతా సానుకూలంగానే ఉంది. టీ20లకు, వన్డేలకు మధ్య ఇప్పుడు చాలా వ్యత్సాసం ఉంది. ప్రస్తుతం ప్రతీ మ్యాచ్‌లోనూ 300 ప్లస్ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఎక్కువ 300 ప్లస్ స్కోర్‌లను చూస్తున్నాం. కొన్నిసార్లు వాటిని ఛేజ్ కూడా చేస్తున్నాం.
టీ20 ప్రపంచకప్ తర్వాత మరిన్ని వన్డేలు ఉంటాయని నేను భావిస్తున్నా. 34 ఓవర్ల తర్వాత కేవలం ఒకే బంతిని ఉపయోగించాలనే కొత్త నిబంధన నేపథ్యంలో ఎలా ఆడాలనే దానిపై ఒక కొత్త పద్దతిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆటగాడి భవిష్యత్తు గురించి చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాదు. కానీ రవీంద్ర జడేజా ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక ఆటగాడు మెరుగ్గా రాణిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం.. జట్టు కోసం ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు’ అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు