Share News

Harmanpreet Kaur: హర్మన్‌ అదరహో..

ABN , Publish Date - Jan 14 , 2026 | 06:24 AM

హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన గుజరాత్‌ టైటాన్స్‌కు ముంబై ఇండియన్స్‌ ఝలక్‌ ఇచ్చింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో...

Harmanpreet Kaur: హర్మన్‌ అదరహో..

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ఢిల్లీ గీయూపీ (రా. 7.30)

  • ఆఖరి ఓవర్‌లో ముంబై విజయం

  • గుజరాత్‌కు తొలి ఓటమి

నవీ ముంబై: హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన గుజరాత్‌ టైటాన్స్‌కు ముంబై ఇండియన్స్‌ ఝలక్‌ ఇచ్చింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్లతో గుజరాత్‌ను ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 నాటౌట్‌) తుదికంటా నిలిచి ముంబైని గెలిపించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. జార్జియా వేర్‌హమ్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 నాటౌట్‌), భారతి (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 నాటౌట్‌), కనికా అహూజా (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), బెత్‌ మూనీ (33) రాణించారు. ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 193/3 స్కోరు చేసి గెలిచింది. అమన్‌జోత్‌ కౌర్‌ (26 బంతుల్లో 7 ఫోర్లతో 40), నికోల కేరీ (23 బంతుల్లో 6 ఫోర్లతో 38 నాటౌట్‌) అదరగొట్టారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా హర్మన్‌ప్రీత్‌ నిలిచింది.

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో..: భారీ ఛేదనలో ముంబై ఇన్నింగ్స్‌ ఆరంభం ఆశించిన రీతిలో సాగలేదు. అయితే హర్మన్‌, కేరీ చివర్లో బ్యాట్లు ఝుళిపించి జట్టుకు అద్భుత విజయాన్నందించారు. ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌ (22), కమలిని (13) పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు. అయితే అమన్‌జోత్‌, హర్మన్‌ ఎదురుదాడికి దిగి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 72 రన్స్‌ జోడించాక 13వ ఓవర్‌లో అమన్‌జోత్‌ అవుటైంది. చివరి 30 బంతుల్లో 59 రన్స్‌ కావాల్సిన వేళ ముంబై గెలుపు కష్టమే అనిపించినా.. 16వ ఓవర్‌లో నికోల 4 ఫోర్లతో 20 రన్స్‌ రాబట్టింది. ఆ తర్వాత లయ తప్పిన గుజరాత్‌ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. చివరి ఓవర్‌లో 5 రన్స్‌ అవసరమవగా, హర్మన్‌ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించింది.


సమష్ఠిగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు కలిసికట్టుగా రాణించారు. క్రీజులో ఉన్నంతసేపు ఎదురుదాడికి దిగారు. ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (8) మాత్రం ఈసారి మూడో ఓవర్‌లోనే వెనుదిరిగింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కనిక కళ్లుచెదిరే షాట్లతో రెండో వికెట్‌కు మూనీతో కలిసి 42 రన్స్‌ జోడించింది. పవర్‌ప్లేలో 62/1 స్కోరు చేసిన గుజరాత్‌ మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదించింది. అయితే ఆయుషి సోని (11) రిటైర్డ్‌ అవుట్‌తో బరిలోకి దిగిన భారతి చివర్లో బ్యాట్‌ ఝుళిపించింది. ఆఖరి ఓవర్‌లో ఆమె 4,6,2,6.. వేర్‌హమ్‌ 4తో 23 రన్స్‌ సమకూరాయి. వీరి ధాటికి ఆరో వికెట్‌కు 24 బంతుల్లోనే అజేయంగా 56 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌: 20 ఓవర్లలో 192/5 (వేర్‌హమ్‌ 43 నాటౌట్‌, భారతి 36 నాటౌట్‌, కనిక 35, మూనీ 33; షబ్నిం 1/25).

ముంబై: 19.2 ఓవర్లలో 193/3. (హర్మన్‌ 71 నాటౌట్‌, కేరీ 38 నాటౌట్‌, అమన్‌జోత్‌ 40; డివైన్‌ 1/29).

ఇవి కూడా చదవండి:

ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్

రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు

Updated Date - Jan 14 , 2026 | 06:24 AM