వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: కైఫ్
ABN , Publish Date - Jun 23 , 2026 | 07:09 AM
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో రానున్న వన్డే ప్రపంచ కప్‌లో కచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోంది. టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతున్నారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ యువ ప్లేయర్లకే ప్రాధాన్యం ఇస్తోన్న నేపథ్యంలో.. రో-కో భవితవ్యంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో రానున్న వన్డే ప్రపంచ కప్‌లో కచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను. కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా రోహిత్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. వారిద్దరూ వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగానే కొనసాగుతున్నారు. యువ ప్లేయర్లకు కూడా గాయాలు అవుతాయి. రోహిత్, కోహ్లీలో క్రికెట్ ఆడాలన్న తపన, ఆటపై నిబద్ధత.. ఇవే వారిని ముందుకు నడిపిస్తాయి. ఇప్పుడు రోహిత్ బ్యాటింగ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ప్రతి బంతిని భారీ షాట్ కొట్టాలని కాకుండా.. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నాడు. రో-కో రానున్న ప్రపంచ కప్‌లో కచ్చితంగా ఆడతారు’ అని కైఫ్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే, జులై 1 నుంచి భారత్.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా వన్డే మ్యాచ్‌లు జులై 14 నుంచి జరగనున్నాయి. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సిరీస్ టీమిండియాకు కీలకంగా మారనుంది. ఇప్పటికే ప్రకటించిన జట్టులో రో-కో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటన సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం.
ఇవి కూడా చదవండి:
అభిమానిని తోసేసిన సెక్యూరిటీ.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే?
టీజీ20 లీగ్2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్