టీజీ20 లీగ్2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:15 PM
టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్(ఆర్ఆర్) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: తెలంగాణ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్(ఆర్ఆర్) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తనయ్ త్యాగరాజన్ ( 30 బంతుల్లో 71 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆర్ఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్ఆర్ మిగిలి బ్యాటర్లలో ఆదిత్య జవ్వాజి (41), అవినాష్ రావు (22), నితిన్ సాయి యాదవ్ (26) రాణించారు. నల్గొండ బౌలర్లలో అనికేత్ రెడ్డి , వరుణ్ గౌడ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. నిశాంత్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు నల్గొండ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7)తోపాటు అర్ఫాన్ అహ్మద్ (7) నిరాశపర్చారు.
ఇక ఆరో స్థానంలో వచ్చిన దివేశ్ సింగ్ (27 బంతులు, 47 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో హర్షవర్థన్ సింగ్ (20 బంతులు, 40 పరుగులు) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ రాహుల్ బుద్ధి 30, వరుణ్ గౌడ్ 26, నితీశ్ రెడ్డి 20 పరుగులు చేశారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య 3 సాధించగా.. నితిన్ సాయి యాదవ్ , ఆర్యన్ చరియప్ప చెరో రెండు వికెట్లు తీశారు. అలానే తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఓటమిపై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు..
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అలా జరిగితేనే సెమీస్‌కు భారత్!