ఆర్డీఎస్‌లో తెలంగాణ నీటి వాటాపై రాజీ లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:31 PM
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(RDS), తుంగభద్ర డ్యామ్‌పై చర్చించారు.
హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(RDS), తుంగభద్ర డ్యామ్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదని తేల్చిచెప్పారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర నీటి పంపిణీ అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కృష్ణా పరీవాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని చెప్పారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తేల్చిచెప్పారు. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్ని అయినా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. తెలంగాణ రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం అన్ని వేదికలపై పోరాడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
30 నెలల్లో వినాశనం.. చీకటిని చూస్తేనే వెలుగుకు విలువ: కేటీఆర్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు
Read Latest Telangana News And Telugu News