30 నెలల్లో వినాశనం.. చీకటిని చూస్తేనే వెలుగుకు విలువ: కేటీఆర్
ABN , Publish Date - Jun 22 , 2026 | 02:52 PM
బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను చూసుకుంటే... కాంగ్రెస్ నేతలు పెద్దలను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన అబద్దాలను నమ్మి.. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంకట్టారన్నారు.
హనుమకొండ, జూన్ 22: బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను చూసుకుంటే... కాంగ్రెస్ నేతలు పెద్దలను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మడికొండలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, సోషల్ మీడియా శిక్షణా తరగతుల కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తెలంగాణలో రాజకీయం దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చెప్పిన అబద్దాలను నమ్మి.. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంకట్టారన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభమని విమర్శించారు. రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని.. పంటల కొనుగోలు విషయంలో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయి రెండున్నరేళ్లు అయ్యిందని... అయినా ప్రజల మమకారం పోలేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రామంతటా గులాబీ జెండా రెపరెపలే కనిపిస్తున్నాయన్నారు. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు... అధికారం మనకు మాత్రమే సొత్తు అనుకోవద్దు. ప్రజలకు మేలు చేస్తారేమో అని ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు’ అని చెప్పారు. దేశం మొత్తం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకుందని.. కానీ 420 హామీలు ఇవ్వడంతో తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. బాండ్ పేపర్లు ఇచ్చి, పథకాల వరద పారిస్తామన్నారని తెలిపారు. సీఎం రేవంత్ నోరు తెరిస్తే బూతుల బురద తప్ప... అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. కండలు తిరిగిన ఉస్తాదు అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. మూడు నెలల్లోనే పిల్లలు పుట్టరని తెలుసని, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పాలనలో బూతుల మోతలు, పచ్చి అబద్ధాలు తప్ప ఏమీ లేవని మాజీ మంత్రి విమర్శించారు. ఢిల్లీ చేతుల్లో పాలన పెడితే నష్టం తప్పదని మొదటినుంచీ చెబుతున్నామని అన్నారు. వంద సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్.. రాష్ట్రానికి వంద పైసలైనా తెచ్చారా అని ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే.. డబ్బుల సంచులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు ఎగొట్టి, యూరియా కోసం లైన్‌లలో నిలబడే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారన్నారు. 30 నెలల్లో వినాశనం జరిగిందని.. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ టూరిజం: మంత్రి జూపల్లి కృష్ణారావు
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News