Share News

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:38 PM

రెండేళ్ల పాలన గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలనేది ముఖ్యమంత్రి అభిమతమని.. దానిలో భాగంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Anam Ramanarayana Reddy

అమరావతి, జూన్ 22: రెండేళ్ల పాలన గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలనేది ముఖ్యమంత్రి అభిమతమని.. దానిలో భాగంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో రెండు సంవత్సరాల ప్రగతిపై ఆనం మాట్లాడుతూ.. 2019-24 మధ్య రాష్ట్రంలో విచ్చిన్నకరమైన వాతావరణం ఉందని విమర్శించారు. దేవాలయాలు సమాజంలో భాగమనే విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో మర్చిపోయారని మండిపడ్డారు. 2024లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించాలని భావించినప్పుడు అప్పటికే భక్తులు, హిందూ బంధువులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. రామతీర్ధంలో శ్రీరామచంద్రుడి శిరచ్ఛేదం, దుర్గమ్మ క్షేత్రంలో వెండిసింహాలు మాయం, అంతర్వేదిలో రథం దగ్ధం వంటి అనేక సంఘటనలు నాడు జరిగాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


టీటీడీతో పాటు అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేయడంతో పాటు వైదికంగా ముందుకు తీసుకెళ్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలతో అత్యంత పవిత్రమైన ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా అనేక ఆలయాలను తీసుకువచ్చామని తెలిపారు. ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో దీపం వెలిగించే పరిస్థితి నాడు లేదని.. దీంతో ఆయా ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రతినెలా పదివేల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. 692 ఆలయాల్లో పనులను ప్రారంభించామని.. కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు. టీటీడీ సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలు నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు.


దేవాదాయ శాఖలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. అంతా ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేయడంతో భగవంతుడి పేరుతో చేసే మోసాలను చాలా వరకూ తగ్గించగలిగామని చెప్పారు. డిజిటల్ వ్యవస్థతో దేవాలయ సేవల పట్ల ప్రజలకు నమ్మకం మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వం వచ్చాక 970 ధర్మకర్తల మండలిలను నియమించామని తెలిపారు. 449 ఆలయాలకు పాలకమండలిని నియమించాలన్నారు. రాబోయే రోజుల్లో 65 ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి

‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 01:19 PM