Share News

ధోని ‘ఫెదరర్’.. కోహ్లీ ‘అల్కరాజ్’.. టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్!

ABN , Publish Date - Jun 22 , 2026 | 09:28 PM

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు తెరలేస్తున్న వేళ, టెన్నిస్ స్టార్లతో క్రికెట్ దిగ్గజాలను పోలుస్తూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికరం వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్‌తో పోల్చాడు.

ధోని ‘ఫెదరర్’.. కోహ్లీ ‘అల్కరాజ్’.. టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్!
Sanju Samson

స్పోర్ట్స్ డెస్క్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు తెరలేస్తున్న వేళ, టెన్నిస్ స్టార్లతో క్రికెట్ దిగ్గజాలను పోలుస్తూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికరం వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్‌తో పోల్చిన శాంసన్.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దూకుడును స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌తో పోల్చాడు. ఓ ఛానల్‌తో శాంసన్ మాట్లాడుతూ.. మైదానంలో ధోని, కోహ్లీల శైలికి, టెన్నిస్ దిగ్గజాల ఆటతీరుకు ఎన్నో పోలికలు ఉన్నాయని పేర్కొన్నాడు.


'క్రికెట్ ప్రపంచంలో రోజర్ ఫెదరర్ ఎవరు అంటే.. నిస్సందేహంగా అది ఎంఎస్ ధోని మాత్రమే. మైదానంలో అతను ఎంతో ప్రశాంతంగా, సంయమనంతో కనిపిస్తాడు. ధోని బ్యాటింగ్ చాలా సునాయాసంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. ఫెదరర్ టెన్నిస్ కూడా అంతే క్లాస్‌గా ఉంటుంది. మరోవైపు, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఆటలో అపరిమితమైన దూకుడు, పవర్ కనిపిస్తాయి. విరాట్ భాయ్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చూపిస్తున్న విధ్వంసకర శైలి సరిగ్గా అల్కరాజ్ లాగే ఉంటుంది. అందుకే విరాట్ కోహ్లిని అల్కరాజ్‌తో పోల్చవచ్చు' అని శాంసన్ వివరించాడు.


ఇదే ఇంటర్వ్యూలో మహిళల, పురుషుల భారత జట్ల ప్రపంచకప్ విజయాల గురించి శాంసన్ ప్రస్తావించాడు. ఇటీవలే భారత మహిళల జట్టు తమ తొలి వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించగా.. ఆ వెంటనే పురుషుల జట్టు కూడా స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మెగా టోర్నీలో శాంసన్ వరుసగా మూడు అర్ధ శతకాలు బాది 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. మహిళల జట్టు సాధించిన విజయమే తమకు పెద్ద స్ఫూర్తిగా నిలిచిందని అతడు చెప్పాడు. మహిళల జట్టు ఫైనల్ ఆడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా అందరితో పాటు తన కుటుంబ సభ్యులంతా టీవీలకు అతుక్కుపోయారని, ఆ విజయం అందించిన జోష్‌తోనే తాము కూడా పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్లుగా అవతరించగలిగామని శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

అభిమానిని తోసేసిన సెక్యూరిటీ.. రోహిత్ శర్మ ఏం చేశాడంటే?

టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

Updated Date - Jun 22 , 2026 | 09:44 PM