Share News

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

ABN , Publish Date - Apr 27 , 2026 | 03:33 PM

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దిగ్వేశ్ రాఠి వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది రింకు మరోసారి సంచలనం సృష్టించాడు.

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!
Rinku Singh

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. స్వల్ప స్కోరుకే పరిమితమవుతుందని అనుకున్న మ్యాచ్‌లో స్టార్ ఫినిషర్ రింకు సింగ్.. బ్యాట్‌తో అదరగొట్టాడు. ఆఖరిలో క్రీజులోకి వచ్చి 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో ఏకంగా 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దిగ్వేశ్ రాఠి వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది రింకు మరోసారి సంచలనం సృష్టించాడు. 2023లో కోల్‌కతా విజయానికి 29 పరుగులు అవసరమైనప్పుడు అతడు వరుసగా ఐదు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. అప్పుడు టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఛాలెంజ్‌ చేశాడు. తాజాగా రింకు ఆ సవాల్‌కు సమాధానం ఇచ్చాడు.


సెహ్వాగ్ సవాల్ ఇదే..

2023లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. అప్పుడు సెహ్వాగ్.. రింకుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇది క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన. టీ20 క్రికెట్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ అతడు చేసి చూపించాడు. అయితే రింకు మళ్లీ ఇలా తన కెరీర్‌లోనే మరోసారి రిపీట్ చేయలేడు. ఇదే నా ఛాలెంజ్’ అని అన్నాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దాదాపు మూడేళ్ల తర్వాత రింకు ఆ సవాల్‌కు సమాధానం ఇచ్చాడు. లఖ్‌నవూతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. రింకు చెలరేగి ఆడటంతో.. కేకేఆర్ 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.


రింకు రియాక్షన్ ఇదే..

ఎల్ఎస్‌జీపై రింకు బ్యాట్‌తోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. ఏకంగా ఐదు క్యాచ్‌లను అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రింకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ‘వరుసగా ఐదు సిక్సర్లు కొట్టగలిగితే ప్రపంచంలో ఇంకా చాలా చేయగలం. సెహ్వాగ్ అప్పుడు చేసిన వ్యాఖ్యలే నాకు ప్రేరణనిచ్చాయి. బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి ఆ మాటలు గుర్తొస్తాయి’ అని తెలిపాడు. కాగా ఈ సీజన్‌ ఆరంభంలో కాస్త నిలకడలేమితో ఇబ్బంది పడిన రింకు.. తాజా నాక్‌తో హీరో అయిపోయాడు.


ఇవి కూడా చదవండి:

పూరన్‌ను పంపించడానికి కారణమదే: లాంగర్

ఐపీఎల్ 2026: రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత

Updated Date - Apr 27 , 2026 | 03:46 PM