చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం.. 240 సీసీటీవీ కెమెరాల ఫీడ్ నిలిపివేత!
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:36 PM
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోన్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తలోకెక్కింది. స్టేడియంలో దాదాపు 240 కెమెరాల ఫీడ్‌ను ఇద్దరు ఉద్యోగులు నిలిపివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోన్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తలోకెక్కింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాని ఆర్సీబీ కప్పు నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మృతి చెందారు. ఆ ఘటన ఇంకా మరువకముందే మరో వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. స్టేడియంలో దాదాపు 240 కెమెరాల ఫీడ్‌ను ఇద్దరు ఉద్యోగులు నిలిపివేశారు. అత్యంత కట్టుదిదట్టమైన భద్రత మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పుడు స్టేడియంలోనే భద్రతకు సంబంధించి కలకలం రేగడం గమనార్హం.
సీసీటీవీలను పర్యవేక్షించే సబ్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు మంజునాథ్, అబ్దుల్ కలామ్ డీయాక్టివేట్ చేసిన యాక్సిస్ కార్డును వినియోగించి అనుమతి లేకుండా కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి సీసీటీవీ ఫైబర్ కనెక్షన్లు, వీడియో రికార్డర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేశారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించి బ్యాకప్ సాయంతో సాధారణ స్థితికి తీసుకొచ్చారు. రియల్ టైమ్ మానిటరింగ్‌ను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. అయితే రూ.10 లక్షల బకాయిలు తమకు రావాల్సి ఉందని, వాటిని చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని పోలీసు విచారణలో సదరు ఉద్యోగులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ అనంతరం కీలక ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫీడ్స్ నిలిపివేసినట్లు అధికారులు గుర్తించారు. సబ్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ‘స్టేడియంలోని కీలక ప్రాంతాల్లో పనిచేసే సీసీటీవీలకు సంబంధించి ఎన్‌వీఆర్, ఫైబర్ కనెక్షన్లను తొలగించారు. ఎంట్రీ గేట్స్, కన్‌కోర్స్ సెక్షన్స్, కార్పొరేట్ స్టాండ్‌తో పాటు స్టేడియంలోని ఇతర ప్రాంతాలను కవర్ చేసే సీసీటీవీల కనెక్షన్లు తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని కబ్బన్ పార్క్ పోలీసులు వెల్లడించారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో భద్రతకు సంబంధించి ఉల్లంఘన చోటు చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఐపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే బ్లాక్ టికెట్ల రాకెట్‌ను బెంగళూరు పోలీసులు ఛేదించారు. లఖ్‌నవూ-ఆర్సీబీ మ్యాచ్‌కు సంబంధించిన వంద టికెట్లను స్టేడియంలోని క్యాంటీన్ వర్కర్ నుంచి సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ప్లేయర్ల ఆగ్రహం!