గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు బిగ్ షాక్.. రఘువంశీకి భారీ జరిమానా
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:39 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్ తగిలింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘు వంశీ అబ్ స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ రూల్ కింద పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అసంతృప్తి చెందిన రఘవంశీ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు. అంతేకాక మైదానం వీడే క్రమంలో హెల్మెట్ విసిరేశాడు. ఈ నేపథ్యంలో రఘవంశీకి బిగ్ షాక్ తగిలింది.
ఈ యువ బ్యాటర్‌పై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదని ఐపీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. లఖ్‌నవూతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడని తెలిపింది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నామని పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే...
ఐపీఎల్-2026లో భాగంగా నిన్న(ఆదివారం) ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ, కోల్‌కతా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. ప్రారంభంలోనే వరుస వికెట్లు పడటంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 4.6 ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ప్రయత్నించాడు.
మరో ఎండ్‌లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఇదే సమయంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... ఎల్ఎస్‌జీ జట్టు ‘అబ్ స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది. రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్‌ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. ఫలితంగా తాజాగా జరిమానా ఎదుర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
పూరన్‌ను పంపించడానికి కారణమదే: లాంగర్
ఐపీఎల్ 2026: రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత