Share News

ఐపీఎల్ 2026: రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:26 PM

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ పద్దెమినిదేళ్ల చరిత్రలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.

ఐపీఎల్ 2026: రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన ఘనత

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అంతేకాక టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును కూడా రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆ రికార్డు వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


అఫ్గానిస్థాన్‌ స్టార్ బౌలర్ రషీద్‌ ఖాన్‌ 2017లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దాదాపు ఆరేళ్ల పాటు సన్‌ రైజర్స్‌తో కొనసాగిన రషీద్‌(Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో చేరాడు. అప్పటి నుంచి ఈ స్పిన్‌ బౌలర్‌ జీటీ తరఫున ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గుజరాత్ జట్టులో భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్‌లో తన 144వ మ్యాచ్‌‌ను రషీద్‌ ఖాన్‌ పూర్తి చేసుకున్నాడు.


కాగా అరంగేట్రం నాటి నుంచి నేటి వరకు రషీద్‌ ఖాన్‌ ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాలేదు. తద్వారా ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్‌ చరిత్ర సృష్టించాడు. తద్వారా భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా(143) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2008లో ఐపీఎల్‪లో అరంగేట్రం చేసిన రైనా.. మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు. 2016లో తొలిసారి మ్యాచ్‌ మిస్‌ అయ్యాడు. అప్పటి వరకు వరుసగా 143 మ్యాచ్‌లు ఆడాడు. 2016లో తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం రషీద్ 68 మ్యాచ్‌ల్లో 73 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.


ఐపీఎల్‌లో అత్యధిక వరుస మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు

  • రషీద్ ఖాన్- 144 మ్యాచ్‌లు - 2017-2026*- ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ టైటాన్స్

  • సురేశ్ రైనా- 143 మ్యాచ్‌లు- 2008-2016 - సీఎస్కే, గుజరాత్ లయన్స్

  • యూసుఫ్ పఠాన్- 95 మ్యాచ్‌లు-2008-2014- ఆర్ఆర్, కేకేఆర్

  • ఎస్ బద్రీనాథ్- 74 మ్యాచ్‌లు- 2008-2012- సీఎస్కే

  • జితేష్ శర్మ- 62 మ్యాచ్‌లు- 2022-2026- ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్


ఇవి కూడా చదవండి:

మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్ భార్య!

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

Updated Date - Apr 27 , 2026 | 12:49 PM