ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్.. గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:45 PM
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది. అయితే శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచులో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. ‘గో గ్రీన్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి సీజన్‌లోనూ ఆర్సీబీ ఆకుపచ్చ జెర్సీలో మ్యాచ్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారైన ఈ గ్రీన్ జెర్సీలు పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
2011లో ఆర్సీబీ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే కార్బన్-న్యూట్రల్ టీ20 ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్సీబీ.. ఇప్పుడు కార్బన్-పాజిటివ్ దిశగా అడుగులు వేస్తోంది. జట్టు సీఈఓ రాజేష్ మీనన్ ఈ విషయం గురించి మాట్లాడారు. ‘గ్రీన్ జెర్సీలు మా బాధ్యతను ప్రతిబింబిస్తాయి. అభిమానులు కూడా పర్యావరణానికి మేలు చేసే అలవాట్లు అలవరుచుకోవాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
అచ్చిరాని జెర్సీ..
అయితే ఈ గ్రీన్ జెర్సీలు ఆర్సీబీకి అంతగా అచ్చిరావు. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఈ జెర్సీలో ఆడిన ఆర్సీబీ.. కేవలం ఐదు మ్యాచుల్లోనే విజయం సాధించింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గ్రీన్ డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మరో 9 మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ జెర్సీ వేసుకుని మ్యాచ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ రెండుసార్లు డకౌట్ కాగా.. ఓ మ్యాచులో సెంచరీ చేశాడు. అయితే రేపు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఎలాంటి ప్రదర్శన ఇవ్వనుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి