డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:04 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడినందుకు అతడికి రూ. లక్ష జరిమానా విధించింది. పలు ఆరోగ్య సమస్యల కారణంగానే ఫోన్ వాడాల్సి వచ్చిందని భిందర్ వివరణ ఇవ్వడంతో అతడు నిషేధం నుంచి తప్పించుకున్నాడు. కేవలం జరిమానా విధించి అతడిని బీసీసీఐ హెచ్చరించింది.
ఆర్సీబీతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడుతూ కనిపించాడు. అది వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం బీసీసీఐ దృష్టికి వెళ్లడంతో రోమి భిందర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భిందర్ ఇచ్చిన వివరణ యాంటీ కరప్షన్ యూనిట్‌ను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిందని సమాచారం. దీంతో అతడిపై జరిమానా విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్లేయర్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియాలో మాత్రం అనుమతి లేదు. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు భిందర్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది ఆయన తొలి తప్పిదం కావడంతో కేవలం జరిమానా, హెచ్చరికతో సరిపెట్టారు. ‘ఇది అందరికీ హెచ్చరికగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇక ఈ వివాదం ముగియడంతో రాజస్థాన్ రాయల్స్ తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించింది. ఏప్రిల్ 19న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
బుమ్రాకు అందుకే వికెట్లు రావడం లేదు: ఇర్ఫాన్ పఠాన్
ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్ లేకుండా టీ20 టోర్నీ