గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:29 PM
అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. గుజరాత్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పుంజుకుంటాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ పేసర్ కార్తిక్ త్యాగి వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కార్తిక్ మాట్లాడాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కేకేఆర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ జట్టు ఖాతాలో ఉన్న ఏకైక పాయింట్ కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం వల్ల వచ్చింది. అలానే ఈ సీజన్‌లో వరుణ్ చక్రవర్తి ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వడం లేదు. వికెట్ల కోసం అతడు పరితపిస్తున్నాడు. తాను బరిలోకి దిగిన మూడు మ్యాచుల్లోనూ భారీగానే పరుగులు సమర్పించాడు.
గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వరుణ్ చక్రవర్తిపై కేకేఆర్ యువ పేసర్ కార్తిక్ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. ఈ మ్యాచ్‌లో వరుణ్ పుంజుకొంటాడని త్యాగి వ్యాఖ్యానించాడు. ప్రతి క్రికెటర్‌కూ క్లిష్టమైన దశ ఎదురవుతూనే ఉంటుందని, ఒక్కోసారి ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. పిచ్ పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నాడు. ఇలాంటివాటి నుంచి నేర్చుకొనేందుకు అవకాశాలు లభిస్తాయని, మెరుగ్గా రాణించి అత్యుత్తమ బౌలర్‌గా మారేందుకు ఛాన్స్ ఉందని త్యాగి అన్నాడు.
వరుణ్ చక్రవర్తి కూడా ఇదే దశలో ఉన్నాడనుకుంటున్నానని, గుజరాత్ మ్యాచ్ లో తప్పకుండా బలంగా పుంజుకొని వస్తాడని కార్తిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రాకపోవచ్చని, జట్టుగా తాము మరోసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. విజయం సాధించేందుకు తమ ప్రణాళికలను అమలు చేస్తామని త్యాగి వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
బుమ్రాకు అందుకే వికెట్లు రావడం లేదు: ఇర్ఫాన్ పఠాన్
ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్ లేకుండా టీ20 టోర్నీ