Share News

ఐపీఎల్ 2026: ముంబై అభిమానులను రెచ్చగొట్టిన అయ్యర్!

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:33 AM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెచ్చగొట్టాడు.

ఐపీఎల్ 2026: ముంబై అభిమానులను రెచ్చగొట్టిన అయ్యర్!
Shreyas Iyer viral catch

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(గురువారం) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ముంబై బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తిస్తే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 'ఇప్పుడు అరవండ్రా' అంటూ ముంబై అభిమానులను అయ్యార్ రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ముంబై ఓపెనర్ డికాక్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఈ స్టేడియం మొత్తం ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే ఉండటంతో ఆరంభం నుంచి వారి హడావుడి ఎక్కువగా కనిపించింది. ముంబై బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి ఆటగాళ్ల చెవులు దద్దరిల్లేలా అభిమానులు నినాదాలు చేశారు. అయితే శ్రేయస్ అయ్యర్ చేసిన పని స్టేడియాన్ని ఒక్కసారిగా సైలెంట్ చేసింది. మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్‌ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.


ఈ ఓవర్ మూడో బంతిని హార్దిక్ పాండ్య లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. అదే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నానని భావించిన అతను చాకచక్యంగా బౌండరీ లోపల ఉన్న జేవియర్ బార్ట్‌లెట్‌కు బంతిని అందించాడు. దాంతో ఈ రిలే క్యాచ్ పూర్తైంది. ఇంతవరకు బాగానే ఉన్నా...ఈ క్యాచ్ పూర్తి చేసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. హార్దిక్ భారీ షాట్ ఆడగానే స్టేడియం మొత్తం దద్దరిల్లాగా.. అయ్యర్ క్యాచ్‌తో నిశబ్దంగా మారిపోయింది. దాంతో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అరవండి రా అంటూ.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా సైగలు చేశాడు. అతని వ్యవహర శైలిని అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్

పంజాబ్‌ బల్లే.. బల్లే

Updated Date - Apr 17 , 2026 | 11:41 AM