ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:42 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(గురువారం) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టడం విశేషం. డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాక ఓ కొత్త చరిత్రను సృష్టించాడు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా, తొలి విదేశీయ ఆటగాడిగా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 51 బంతుల్లో 108 పరుగులు, 2022లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 70 బంతుల్లో140 నాటౌట్ చేశాడు. తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ,లఖ్‌నవూ) ఈ ఫీట్ సాధించారు. ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనార్హం.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మన్స్ పంజాబ్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్(112) రెండో స్థానంలో నిలిచాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) మూడో స్థానంలో నిలిచాడు. 2026 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ డికాక్‌ను కేవలం కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి:
ఇడ్లీ..దోశ పాటతో అవమానించారు..