Share News

పంజాబ్‌ బల్లే.. బల్లే

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:06 AM

తాజా ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమనేదే లేకుండా దూసుకెళ్తోంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాల్లో సమష్ఠిగా విరుచుకుపడుతుండడంతో ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తుతున్నాయి. ఇదే తరహాలో...

పంజాబ్‌ బల్లే.. బల్లే

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X కోల్‌కతా

వేదిక అహ్మదాబాద్‌ రా.7.30 నుంచి

ముంబైపై ఘనవిజయం

ప్రభ్‌సిమ్రన్‌, శ్రేయాస్‌ అర్ధసెంచరీలు

డికాక్‌ అజేయ శతకం వృథా

ముంబై: తాజా ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమనేదే లేకుండా దూసుకెళ్తోంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాల్లో సమష్ఠిగా విరుచుకుపడుతుండడంతో ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తుతున్నాయి. ఇదే తరహాలో గురువారం ముంబై ఇండియన్స్‌ను వారి సొంత మైదానంలోనే 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పేసర్‌ అర్ష్‌దీప్‌ (3/22) పదునైన బౌలింగ్‌కు.. ప్రభ్‌సిమ్రన్‌ (39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్‌), కెప్టెన్‌ శ్రేయాస్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) హాఫ్‌ సెంచరీలు తోడయ్యాయి. ప్రస్తుతం పంజాబ్‌ 9 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. అటు ముంబైకి ఐదు మ్యాచ్‌ల్లో ఇది వరుసగా నాలుగో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఓపెనర్‌ డికాక్‌ (60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 నాటౌట్‌) అజేయ శతకం సాధించగా, నమన్‌ ధిర్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) మాత్రమే సహకరించాడు. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఘజన్‌ఫర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌ నిలిచాడు.

చెలరేగిన ప్రభ్‌సిమ్రన్‌-శ్రేయా్‌స: ఓ మాదిరి ఛేదన పంజాబ్‌ బ్యాటర్ల ఆధిపత్యం ముందు సునాయాసంగా సాగింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ తుదికంటా నిలవగా.. అతడికి కెప్టెన్‌ శ్రేయాస్‌ భారీ భాగస్వామ్యంతో అండగా ఉన్నాడు. ఈ జోడీ ధాటికి ముంబై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఓవర్‌లోనే ప్రభ్‌ 4,4 ప్రియాన్ష్‌ 6,4తో ఏకంగా 21 పరుగులు సమకూరాయి. అయితే స్పిన్నర్‌ ఘజన్‌ఫర్‌ తన వరుస ఓవర్లలో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (15), కూపర్‌ (17)లను అవుట్‌ చేసి తమ జట్టు శిబిరంలో కాస్త జోష్‌ నింపాడు. కానీ ప్రభ్‌-శ్రేయాస్‌ జోడీ తమదైన శైలిలో ఛేదన వైపు సాగింది. పవర్‌ప్లేలో జట్టు 61/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రభ్‌ ఎదురుదాడికి దిగి చకచకా బౌండరీలు రాబట్టి 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు జోరు పెంచిన శ్రేయాస్‌.. బుమ్రా ఓవర్‌లో రెండు ఫోర్లతో హ్యాట్రిక్‌ ఫిఫ్టీని అందుకున్నాడు. ఇక శార్దూల్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదినా నమన్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికి మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం రాగా.. విజయానికి 27 బంతుల్లో 11 పరుగులే అవసరమయ్యాయి. దీంతో పంజాబ్‌ ఎలాంటి ఇబ్బందీ లేకుండా మరో 21 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.


డికాక్‌ అంతా తానై..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డికాక్‌ మెరుపు ఆటతీరుతో అజేయంగా నిలిచాడు. అతడికి నమన్‌ ధిర్‌ మాత్రమే సహకారం అందించాడు. డెత్‌ ఓవర్లలో పంజాబ్‌ పేసర్లు ముంబైని కట్టడి చేశారు. పేసర్‌ అర్ష్‌దీప్‌ వరుస బంతుల్లో రికెల్టన్‌ (2), సూర్యకుమార్‌ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ స్థితిలో డికాక్‌తో కలిసి నమన్‌ ధిర్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. నమన్‌ పది పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను చాహల్‌ వదిలేయడం కూడా కలిసివచ్చింది. ఆరో ఓవర్‌లో నమన్‌ 4,4,6తో చెలరేగడంతో పవర్‌ప్లేలో ఎంఐ 48 పరుగులు చేయలిగింది. అనంతరం డికాక్‌ జోరు పెంచి భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఈ జోడీ ప్రమాదకరంగా మారిన వేళ శశాంక్‌ తన తొలి ఓవర్‌లోనే నమన్‌ను అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 68 బంతుల్లో 122 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అటు డికాక్‌ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూనే ఓ ఫోర్‌తో 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కానీ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడిన హార్దిక్‌ (14) నిరాశపర్చాడు. అతడి షాట్‌ను అందుకున్న శ్రేయాస్‌ బౌండరీ లైన్‌పై పడిపోవడానికి ముందే బంతిని గ్రౌండ్‌లోకి విసరడంతో అక్కడే ఉన్న బార్ట్‌లెట్‌ పట్టేశాడు. ఆ వెంటనే రెండు ఓవర్లలో రూథర్‌ఫోర్డ్‌ (1), తిలక్‌ (8) నిష్క్రమించడంతో ముంబై ఆఖరి నాలుగు ఓవర్లలో కేవలం 35 పరుగులే చేయగలిగింది. దీంతో జట్టు స్కోరు కూడా 200 లోపే ముగిసింది.

గుజరాత్‌ 4 2 2 0 4 -0.029

లఖ్‌నవూ 5 2 3 0 4 -0.804

చెన్నై 5 2 3 0 4 -0.846

ముంబై 5 1 4 0 2 -1.076

కోల్‌కతా 5 0 4 1 1 -1.383


స్కోరుబోర్డు

ముంబై: రికెల్టన్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, డికాక్‌ (నాటౌట్‌) 112, సూర్యకుమార్‌ (సి) చాహల్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, నమన్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) శశాంక్‌ 50, హార్దిక్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) యాన్సెన్‌ 14, రూథర్‌ఫోర్డ్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, తిలక్‌ (రనౌట్‌) 8, మయాంక్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 195/6. వికెట్ల పతనం: 1-12, 2-12, 3-134, 4-175, 5-182, 6-193; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-22-3, యాన్సెన్‌ 4-0-30-1, బార్ట్‌లెట్‌ 4-0-39-1, వైశాక్‌ 3-0-36-0, చాహల్‌ 3-0-45-0, శశాంక్‌ 2-0-19-1.

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) చాహర్‌ (బి) ఘజన్‌ఫర్‌ 15, ప్రభ్‌సిమ్రన్‌ (నాటౌట్‌) 80, కూపర్‌ (సి) డికాక్‌ (బి) ఘజన్‌ఫర్‌ 17, శ్రేయాస్‌ (సి) నమన్‌ (బి) శార్దూల్‌ 66, స్టొయినిస్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 16.3 ఓవర్లలో 198/3; వికెట్ల పతనం: 1-27, 2-45, 3-184; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 2.3-0-45-0, బుమ్రా 4-0-41-0, ఘజన్‌ఫర్‌ 4-0-31-2, హార్దిక్‌ 3-0-39-0, శార్దూల్‌ 3-0-42-1.

2

ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (112 నాటౌట్‌)ను సాధించిన రెండో బ్యాటర్‌గా డికాక్‌. జయసూర్య (2008లో 114 నాటౌట్‌) ముందున్నాడు.

3

మూడు జట్ల (డీడీ, ఎల్‌ఎ్‌సజీ, ఎంఐ) తరఫున సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా డికాక్‌. గతంలో రాహుల్‌, శాంసన్‌ ఈ ఫీట్‌ సాధించారు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 5 4 0 1 9 1.067

బెంగళూరు 5 4 1 0 8 1.503

రాజస్థాన్‌ 5 4 1 0 8 0.889

హైదరాబాద్‌ 5 2 3 0 4 0.576

ఢిల్లీ 4 2 2 0 4 0.322

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బౌలర్‌

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ

Updated Date - Apr 17 , 2026 | 03:06 AM