బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:12 PM
బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ రూబెల్ హెస్సేన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హెస్సేన్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 36 ఏళ్ల రూబెల్ 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి వన్డేలోనే నాలుగు వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా రూబెల్ చరిత్ర సృష్టించాడు. తన 16 ఏళ్ల కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 193 వికెట్లు తీశాడు. అలానే 27 టెస్ట్‌ల్లో 36 వికెట్లు, 104 వన్డేల్లో 129 వికెట్లు, 28 టీ20ల్లో 28 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్ తరఫున రూబెల్ 2021 ఏప్రిల్‌లో తన చివరి మ్యాచ్ (టీ20) ఆడాడు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసిన సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. చివరికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇకపై దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూ, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ఉంటానని రూబెల్ స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ సందేశంలో అభిమానులు, కుటుంబం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.
పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన రూబెల్ రివర్స్ స్వింగింగ్ యార్కర్లు వేయడంలో దిట్ట. 2015 వన్డే ప్రపంచ కప్‌లో పటిష్ఠమైన ఇంగ్లండ్‌ను మట్టి కరిపించడంలో రూబెల్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతను వేసిన 4/53 స్పెల్ బంగ్లాదేశ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో వ్యక్తిగా రూబెల్ నిలిచాడు. 2013లో న్యూజిలాండ్‌పై అతను సాధించిన ఆరు వికెట్లలో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. అంతేకాక రూబెల్, టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మధ్య అనేక సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ