వచ్చేసింది యువరాణి
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:02 AM
భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది. ఈ 24 ఏళ్ల చెన్నై స్టార్ ప్రతిష్ఠాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్ర
వెన్‌జున్‌తో ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత
ప్రజ్ఞానంద, దివ్యకు ఏడో స్థానం
ఓపెన్ విభాగం విజేత సిందరోవ్
పఫోస్ (సైప్రస్): భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది. ఈ 24 ఏళ్ల చెన్నై స్టార్ ప్రతిష్ఠాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన ఘతన సాధించింది. ఈ విజయంతో చదరంగ యువరాణిగా నిలిచిన వైశాలి.. చాలెంజర్ హోదాలో ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ వెన్‌జున్‌తో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ ఏడాది ఆఖర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదిక, తేదీలను ఫిడే ఖరారు చేయాల్సి ఉంది. ఇక..క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ మంగళవారంనాటి 13వ రౌండ్ నాటికే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దరిమిలా..ప్రస్తుత వరల్డ్ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్ తో టైటిల్ కోసం సిందరోవ్ పోటీపడతాడు.
ఒత్తిడిని అధిగమించి..: బుధవారం తప్పక గెలవాల్సిన క్యాండిడేట్స్ టోర్నీ ఆఖరిదైన 14వ రౌండ్‌లో తెల్లపావులతో ఆడిన వైశాలి 48 ఎత్తుల్లో కాటరినా లగ్నో (రష్యా)ను చిత్తు చేసింది. దాంతో మొత్తం 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన వైశాలి క్యాండిడేట్స్ టైటిల్ సొంతం చేసుకుంది. అంతకుముందు రోజు 13వ రౌండ్ ముగిసే సరికి బిబిసార అసుబయేవా (కజకిస్థాన్), వైశాలి చెరో 7.5 పాయింట్లతో టైటిల్ రేసులో నిలిచారు. కానీ చివరి రోజు ఆఖరి గేమ్‌లో బిబిసారను భారత గ్రాండ్‌మాస్టర్ దివ్యా దేశ్‌ముఖ్ నిలువరించింది. ఫలితంగా బిబిసార 8 పాయింట్లతో నిలిచింది. ఈనేపథ్యంలో లగ్నోతో ఆఖరి రౌండ్‌లో వైశాలి నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తీవ్ర ఒత్తిడి అధిగమించి, లగ్నోను ఓడించడంతో క్యాండిడేట్స్ కిరీటం వైశాలికి దక్కింది. ఓవరాల్‌గా 14 రౌండ్లలో ఐదు గేమ్‌లను గెలిచిన వైశాలి, ఏడింటిని డ్రా చేసుకుంది. రెండు గేమ్‌లలో ఓటమి పాలైంది. ఈ టైటిల్‌తోపాటు వైశాలి రూ. 31 లక్షలు ప్రైజ్‌మనీగా అందుకుంది. బిబిసార రన్నర్‌పగా నిలిచింది. దివ్య 5.5 పాయింట్లతో ఏడో స్థానంతో టోర్నీని ముగించింది. ఓపెన్ విభాగంలో సిందరోవ్‌కు టైటిల్ గత రౌండ్‌లోనే ఖరారుకాగా..బుధవారం జరిగిన 14వ రౌండ్‌లో వీ యీ (చైనా)తో గేమ్‌ను అతడు డ్రా చేసుకున్నాడు. మొత్తం 10 పాయింట్లతో సిందరోవ్ అగ్రస్థానంలో నిలిచాడు. డచ్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరి (8.5) రన్నర్‌పతో సరిపెట్టుకున్నాడు. వైశాలి సోదరుడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో ఏడోస్థానానికి పరిమితమయ్యాడు. నకమురా (అమెరికా)తో ఆఖరి రౌండ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు.
చాలెంజర్ అంటే..
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరే పోటీపడతారు. ఒకరు డిఫెండింగ్ చాంపియన్.. మరొకరు చాలెంజర్. క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన వారే చాలెంజర్. క్వాలిఫికేషన్ ప్రక్రియ ద్వారా 8 మంది ఆటగాళ్లను క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. రెండేళ్ల క్రితం క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్.. చాలెంజర్‌గా పోటీపడి ప్రపంచ చాంపియన్‌గానూ అవతరించిన సంగతి తెలిసిందే.
3 ఆనంద్, గుకేశ్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన మూడో భారత ప్లేయర్‌గా వైశాలి.