ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్ లేకుండా టీ20 టోర్నీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:53 PM
జై షా నాయకత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్-2026కు ముందు సరికొత్త టీ20 టోర్నీని ఐసీసీ ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రియులకు మరో క్రేజీ న్యూస్ వచ్చింది. జైషా నాయకత్వంలోని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్-2026కు ముందు ఓ సరికొత్త టోర్నీని ఐసీసీ ప్రకటించింది. ఈ కొత్త టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో ఉండనుంది. మహిళల కోసం ఐసీసీ ప్రకటించిన ఈ నయా టోర్నీకి టీ20 ఛాలెంజ్‌గా నామకరణం చేశారు.
అసోసియేట్ దేశాలకు చెందిన జట్లకు తగిన గుర్తింపును కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నీని ఐసీసీ ప్రారంభించింది. అందుకే ఈ టోర్నమెంట్‌లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొనవు. ఈ టోర్నీ మొదటి సీజన్ రువాండాలోని కిగాలీ నగరంలో జరగనుంది. ఈ ఐసీసీ టీ20 ఛాలెంజ్ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి.
డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు జరగనుంది. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టుకు 8 మ్యాచ్‌లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ ఐసీసీ మహిళల టీ20ఐ ఛాలెంజ్ తొలి ఎడిషన్ రువాండ(ఆఫ్రికా) , ఇటలీ(యూరప్), నేపాల్(ఆసియా), యూఎస్ఏ(అమెరికా), వనౌటు(ఈస్ట్ ఆసియా-పసిఫిక్) అనే ఐదు జట్ల మధ్య జరగనుంది .
ఇవి కూడా చదవండి:
నా దగ్గర మాటల్లేవు.. ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్య
టీ20 ప్రపంచ కప్: క్రికెట్ కెనడాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. చర్యలకు దిగిన ఐసీసీ!