Share News

టీ20 ప్రపంచ కప్: క్రికెట్ కెనడాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. చర్యలకు దిగిన ఐసీసీ!

ABN , Publish Date - Apr 17 , 2026 | 02:41 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసి నెలన్నర రోజులు దాటినప్పటికీ ఓ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ దృష్టి పడింది.

టీ20 ప్రపంచ కప్: క్రికెట్ కెనడాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. చర్యలకు దిగిన ఐసీసీ!
ICC

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన చేసి వరుసగా రెండోసారి కప్పును ముద్దాడింది. అయితే ఈ మెగా టోర్నీ ముగిసి నెలన్నర రోజులు దాటినప్పటికీ ఓ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అదే గ్రూప్ స్టేజిలో కెనడా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్. కివీస్ సూపర్ 8లోకి రావడమే కష్టమనే పరిస్థితి నుంచి అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. గ్రూప్ స్టేజిలో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా దీనిపై ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ దృష్టి పడింది.


టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో చెపాక్ వేదికగా కెనడా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో అనూహ్యంగా కెనడాపై కివీస్ ఘన విజయం సాధించి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఆ పోరులో కెనడా క్రికెట్ బోర్డు ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఇటీవల ఓ డాక్యుమెంటరీ పేర్కొంది. దానిపై ఐసీసీ విచారణ చేపడుతోందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ కెనడాకు సంబంధించిన వచ్చిన ఆరోపణలపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఆధ్వర్యంలో రెండు ఇన్వెస్టిగేషన్స్ టీమ్‌లు విచారణను మొదలుపెట్టినట్టు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.


అనుమానాస్పదంగా ఐదో ఓవర్..

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ అనుమానాస్పదంగా మారిందని కెనడాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమం ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ తెలిపింది. కేవలం టోర్నీకి మూడు వారాల ముందే బజ్వాను కెనడాకు కెప్టెన్‌గా బోర్డు నియమించింది. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి కేవలం 35 పరుగులే చేసిన కివీస్.. బజ్వా వేసిన ఐదో ఓవర్లో 15 పరుగులు రాబట్టింది. అందులో ఒక నో బాల్, ఒక వైడ్ ఉండటం గమనార్హం. అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయిందని సదరు డాక్యుమెంటరీ ఆరోపణ. అయితే ఇలాంటివాటిపై తమ ఏసీయూ ఇప్పటికిప్పుడు స్పందించే స్థితిలో లేదని ఐసీసీ తాత్కాలిక జీఎం ఆండ్రూ ఎప్‌గ్రేవ్ తెలిపారు. విచారణ తర్వాతే అసలు విషయం తేలుతుందని వెల్లడించారు. ఇక జట్టు ఎంపికకు సంబంధించి మాజీ కెనడా కోచ్ ఖుర్రమ్ చోహాన్ పాత్ర పైన కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది.


ఫిబ్రవరి 17న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ యువరాజ్ సమ్రా(110) సెంచరీ బాదాడు. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్.. కేవలం 15.1 ఓవర్లలోనే ఆటను ముగించారు. గ్లెన్ ఫిలిప్స్(59*), రచిన్ రవీంద్ర(76*) అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను సులభంగా గెలిపించి సూపర్ 8లోకి అడుగుపెట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్

పంజాబ్‌ బల్లే.. బల్లే

Updated Date - Apr 17 , 2026 | 03:08 PM