బుమ్రాకు అందుకే వికెట్లు రావడం లేదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:51 PM
ఐపీఎల్ 2026లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. కట్టుదిట్టంగా బంతులేసే బుమ్రా.. ఇప్పుడు భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. కట్టుదిట్టంగా బంతులేసే బుమ్రా.. ఇప్పుడు భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి.. ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. జట్టు కష్టాల్లో ఉంటే ఆదుకునే అతడు.. ఇప్పుడు ఇలా అవ్వడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బుమ్రాకు ఏమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక సూచన చేశాడు.
‘బుమ్రా బౌలింగ్‌కు వస్తున్నాడంటే వికెట్ పడుతుందనే అనుకుంటారు. అయితే ప్రస్తుతం అదే జరగడం లేదు. అతడి ఫామ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బుమ్రా స్పీడ్ సగటు 130కిమీ మాత్రమే ఉంది. ఇక స్లో బంతులను కూడా ఇటీవల ఎక్కువగా సంధించాడు. దాదాపు 44శాతం ఇలాంటి బాల్స్ విసిరాడు. అంటే ప్రతి రెండు బంతుల్లో ఒకటి స్లో బాల్. అలా ఎందుకు వేస్తున్నాడు? అనే విషయాన్ని అతడు విశ్లేషించుకోవాలి. ఒకవేళ ఎక్కువ స్పీడ్‌తో బౌలింగ్ చేసి.. స్లో బంతులను తగ్గిస్తే వికెట్లు వస్తాయని అనుకుంటున్నా. ఇది చాలా సింపుల్ పరిష్కారం.
బుమ్రాకు ప్రత్యేకంగా కోచింగ్ అవసరం లేదు. అయితే బౌలింగ్ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వేగంగా బౌలింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు స్లో బంతులను విసిరితే ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
నా దగ్గర మాటల్లేవు.. ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్య
టీ20 ప్రపంచ కప్: క్రికెట్ కెనడాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. చర్యలకు దిగిన ఐసీసీ!