Share News

ధోని వికెట్ తీస్తేనే సీఎస్కేలో అవకాశం వస్తుందని భావించా: అశ్విన్

ABN , Publish Date - May 08 , 2026 | 07:00 PM

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.

ధోని వికెట్ తీస్తేనే సీఎస్కేలో అవకాశం వస్తుందని భావించా: అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు. కెరీర్ ఆరంభంలో స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని వికెట్ తీసిన ఆనందంలో అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడని, దీంతో ధోని తనపై అసహనం వ్యక్తం చేశాడని వెల్లడించాడు. జియో స్టార్ నిర్వహించిన ‘ది రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్‌పీరియన్స్’ అనే కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడాడు.


‘నా కెరీర్ ఆరంభంలో జట్టులో ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ స్పిన్నర్లు ఉండటంతో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2008లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2009 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై తొలి మ్యాచ్ ఆడాను. కానీ 2010 వరకు నాకు అవకాశాలు పరిమితంగానే వచ్చాయి. అయితే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా ఎంఎస్ ధోనికి బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. నా బౌలింగ్‌లో ధోని డీప్ కవర్ షాట్ ఆడగా నేను డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాను. ఆ వికెట్ తీసిన ఆనందంలో అతిగా సెలబ్రేట్ చేసుకున్నా. దీంతో ధోని చిరాకు పడ్డాడు. ‘ఇంతగా సెలబ్రేట్ చేసేదేముంది?’ అంటూ ప్రశ్నించాడు. ‘మీ వికెట్ తీసుకోవడం నా కల.. ఇదే నాకు సీఎస్కేలో అవకాశం తెచ్చిపెడుతుందని నా నమ్మకం’ అని చెప్పా. ఆ తర్వాతి ఏడాదే నాకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అవకాశం వచ్చింది’ అని అశ్విన్ వెల్లడించాడు.


అదే నా కోరిక..

‘సీఎస్కేలో మంచి బ్యాటర్లు మాత్రమే కాదు.. నాణ్యమైన బౌలర్లు కూడా ఉండేవారు. మురళీ విజయ్, బద్రీనాథ్, షాదాబ్ వంటి దేశీయ ప్లేయర్లు కీలక పాత్ర పోషించేవారు. ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛ, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. టికెట్లు, ప్రయాణం, హోటల్ గదులు.. అన్నీ ఫ్రాంచైజీనే చూసుకునేది. ఆటగాళ్లు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టేలా వాతావరణం ఉండేది. నా ఐపీఎల్ ప్రయాణం సీఎస్కేతోనే ముగియడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసింది. చెపాక్‌లో చివరి మ్యాచ్ ఆడాలనేది నా కోరిక. అది కూడా నెరవేరి ఉంటే మరింత ఆనందంగా ఉండేది’ అని అశ్విన్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 08 , 2026 | 07:00 PM