Share News

కుల్దీప్‌ను పక్కన పెట్టడం బాధాకరం.. భారత జట్టు ఎంపికపై అశ్విన్ అసంతృప్తి

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:24 PM

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేకి భారత తుది జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.

కుల్దీప్‌ను పక్కన పెట్టడం బాధాకరం.. భారత జట్టు ఎంపికపై అశ్విన్ అసంతృప్తి
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేకి భారత తుది జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు. ఇలాంటి నిర్ణయాలు ఓ బౌలర్ లయ, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కుల్దీప్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. అంతకుముందు స్వదేశంలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా అతడు కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో అతడికి అవకాశం ఇవ్వకపోవడంపై అశ్విన్ ఘాటుగా స్పందించాడు.


‘కుల్దీప్‌ను ఆడించకపోవడానికి ఎప్పుడూ బ్యాటింగ్ ఆర్డర్ కారణంగా వినిపిస్తోంది. ఏడో స్థానం వరకు బ్యాటింగ్ ఉండాలనే వాదనతోనే అతడిని పక్కన పెడుతున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. బుమ్రా లేకపోవడం కూడా కలిసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్‌కు అవకాశం రాకపోవడం నిజంగా బాధాకరం. ఒక బౌలర్‌ను వరుస మ్యాచ్‌లకు పక్కన పెట్టడం అతని లయ, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది’ అని అశ్విన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు.


ఇటీవలి కాలంలో భారత యాజమాన్యం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆల్‌రౌండర్లుగా వారు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతుండటంతో జట్టులో స్థానం దక్కించుకుంటున్నారు. అయితే ఫినిషర్లలో బ్యాటింగ్ పరిమితులు ఉండటమే కుల్దీప్‌కు ప్రతికూలంగా మారుతోంది. ప్రధాన బలం వికెట్లు తీయడమే అయినప్పటికీ, బ్యాటింగ్ కారణంగా అతడు పదేపదే జట్టుకు దూరమవుతున్నాడు.


ఐపీఎల్ నుంచి..

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ టోర్నీ అనంతరం ట్రేడ్ ద్వారా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మారాడు. అదే ఒప్పందంలో రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. వన్డేల్లో ఇప్పటివరకు 121 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్.. 194 వికెట్లు పడగొట్టి అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. అయినప్పటికీ వరుసగా జట్టుకు దూరమవుతుండటం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!

జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం

Updated Date - Jul 19 , 2026 | 09:24 PM