జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:10 PM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది. ఈ టైటిల్ అందుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధు.. భావోద్వేగానికి గురైంది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది. ఈ టైటిల్ అందుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధు.. భావోద్వేగానికి గురైంది. కష్టకాలంలో కూడా తనపై నమ్మకం కోల్పోలేదని.. అదే తన విజయానికి కారణమైందని వెల్లడించింది. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇదే జోరును కొనసాగించి రికార్డు స్థాయిలో ఆరో పతకాన్ని సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది. కాగా ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ యమగూచిపై 21-17, 21-17 వరుస సెట్లలో సింధు గెలుపొందిన సంగతి తెలిసిందే.
‘ఈ గెలుపు నాకు ఎంతో ప్రత్యేకం. చాలా కాలంగా దీని కోసమే కష్టపడుతున్నాను. గెలిచిన వెంటనే నా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. గత 19 నెలలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాను. చాలా మంది 'ఇక సింధు పని అయిపోయిందా?' అని ప్రశ్నించినా.. నేను మాత్రం నా మీద నమ్మకం కోల్పోలేదు. నేను చేయగలనని ఎప్పుడూ విశ్వసించాను. ఆ నమ్మకమే నన్ను గెలిపించింది. ఈ ప్రయాణంలో నాకు తోడున్న నా కోచ్‌లకు, నా వెన్నంటే ఉన్న తల్లిదండ్రులు, నా భర్త, అత్తమామలకు కృతజ్ఞతలు ’ అని సింధు వెల్లడించింది. 2024 డిసెంబర్‌లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇది తొలి మేజర్ టైటిల్. అలాగే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఆమె ఖాతాలో చేరిన అత్యంత ప్రతిష్ఠాత్మక గెలుపు కూడా ఇదే.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై గురి
ఆగస్టు 17 నుంచి 23 వరకు భారత్ వేదికగా జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు ఈ విజయం తనలో అపార ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సింధు తెలిపింది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు గెలిచిన ఆమె.. మరో పతకం సాధిస్తే మహిళల సింగిల్స్‌లో ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనుంది. ‘ఇప్పుడున్న ఆటతీరు, ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని అలాగే కొనసాగించాలి. ఈ విజయానికి ఇదే సరైన సమయం. ఇదే జోరును ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. అటాకింగ్ గేమ్ నా బలం. ఇప్పుడు కోర్టులో స్వేచ్ఛగా కదులుతూ దూకుడుగా ఆడగలుగుతున్నాను. అనవసర తప్పిదాలను తగ్గించగలిగితే మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. అదే ఈ టోర్నీలో నాకు కలిసొచ్చింది’ అని సింధు వివరించింది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?