Share News

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:39 PM

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి తన సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో మెస్సికి ఇదే ఆఖరి ఫిఫా మ్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి తన సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో మెస్సికి ఇదే ఆఖరి ఫిఫా మ్యాచ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నేడు స్పెయిన్-అర్జెంటీనా జట్లు ఫైనల్ పోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచర ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను మెస్సి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో జట్టుతో తన ప్రయాణం ముగింపు దశకు చేరుకుందని మెస్సి మరోసారి సంకేతాలు ఇచ్చినట్లుగా నెట్టింట చర్చ మొదలైంది.


‘ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు ట్రోఫీల కంటే ఎక్కువ.. జట్టుతో కలిసి గడిపిన ప్రతి క్షణం అత్యంత విలువైనది. కష్టకాలంలో ఒకరికొకరం అండగా నిలవడం, ప్రతి అడుగును ఆస్వాదించడం నిజమైన సంపదగా భావిస్తున్నా. నా సహచరులు, కోచింగ్ సిబ్బంది, ఈ జట్టును ఒక కుటుంబంలా నిలబెట్టేందుకు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రేపు ఏం జరిగినా.. ఈ జట్టు ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఆ జ్ఞాపకాలను ఎవరూ చెరపలేరు. కమాన్ అర్జెంటీనా’ అని మెస్సి పోస్ట్‌లో పేర్కొన్నాడు.


ఈ ప్రపంచ కప్ ఫైనల్ మెస్సికి చివరిదయ్యే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికుతాడని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మెస్సి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. ప్రస్తుతం తన దృష్టంతా ఫైనల్‌పైనే ఉందని తెలిపాడు. తాజా పోస్ట్‌తో ఈ మ్యాచ్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతాడనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది. స్పెయిన్‌పై ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ సస్పెన్స్‌కు తెర పడే అవకాశముంది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన బీసీసీఐ

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు!

Updated Date - Jul 19 , 2026 | 02:40 PM