జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు!
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:17 AM
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు అద్భుత ప్రదర్శనతో మెరిసింది. అంతేకాక తన కెరీర్‌లో మొట్టమొదటి సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకుంది పీవీ సింధు. టోక్యో వేదికగా ఇవాళ(ఆదివారం) జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21-17, 21-17తో వరుస గేమ్స్ తేడాతో జపాన్ ప్లేయర్ అకానె యమగూచిని సింధు చిత్తు చేసింది. దీంతో జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డులకెక్కింది.
2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా, 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన తర్వాత సింధు సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం. జపాన్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం యమగూచికి ఇది ఆరోసారి. గత నాలుగేళ్లుగా ఆమెపై పూర్తి స్థాయిలో ఆడిన ఏ మ్యాచ్‌లోనూ సింధు విజయం సాధించలేకపోయింది. ఈ ఏడాది మలేషియా ఓపెన్‌లో వీరిద్దరూ తలపడినప్పటికీ.. తొలి గేమ్ తర్వాత యమగూచి గాయం కారణంగా వైదొలిగింది.
ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రారంభం నుంచే సింధు పూర్తి దూకుడును ప్రదర్శించింది. అద్భుతమైన నెట్ గేమ్, పక్కా ప్రణాళికతో కోర్టుపై పూర్తి నియంత్రణ సాధించింది. యమగూచికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా బంతిని నెట్‌కు దగ్గరగా ఉంచుతూ, క్రాస్-కోర్ట్, బాడీ స్మాష్‌లతో విరుచుకుపడింది. క్రమశిక్షణ, నిగ్రహంతో కూడిన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చరిత్రాత్మక విజయంతో సింధు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
తల తెగినా పోరాటం ఆపని రోబో.. వీడియో వైరల్!
రోహిత్ శర్మను మెస్సితో పోల్చిన టీమిండియా మాజీ క్రికెటర్