తల తెగినా పోరాటం ఆపని రోబో.. వీడియో వైరల్!
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:31 AM
చాలా మందికి బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఏ స్థాయిలో అయినా ఈ క్రీడ జరుగుతుంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మనం మనుషుల మధ్య బాక్సింగ్ చూశాం. కానీ..
స్పోర్ట్స్ డెస్క్: చాలా మందికి బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఏ స్థాయిలో అయినా ఈ క్రీడ జరుగుతుంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మనం మనుషుల మధ్య బాక్సింగ్ చూశాం. కానీ మొట్టమొదటి సారి హ్యూమనాయిడ్ రోబోల మధ్య ఈ పోరు జరిగింది. 'అల్టిమేట్ రోబోట్ నాకౌట్ లెజెండ్' (URKL) పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్ చైనాలోని షెన్‌జెన్ నగరంలో అత్యంత నాటకీయంగా ప్రారంభమైంది.
చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ 'ఇంజిన్ ఏఐ' (Engine AI) ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే, టోర్నీ తొలి రోజే రింగ్‌లో ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రారంభ మ్యాచ్‌లో 'ఇంజిన్ ఏఐ టీ800' (EngineAI T800) సిరీస్‌కు చెందిన 'వైట్ ఈగిల్', 'మాటడార్' అనే రెండు రోబోలు రింగ్‌లోకి దిగాయి.
మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో.. 'వైట్ ఈగిల్' రోబో వేగంగా స్పందించి ప్రత్యర్థిపై బలమైన 'హై కిక్' విసిరింది. ఆ దెబ్బకు 'మాటడార్' రోబో తల భాగం ఊడిపోయింది. వైర్లు తెగి తల పక్కకు వేలాడుతున్నప్పటికీ, ఆ రోబో ఏమాత్రం తగ్గలేదు. తల తెగినా ప్రత్యర్థిపై పంచ్‌లు, కిక్‌లతో దాడిని కొనసాగించడం అక్కడ ఉన్నవారందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తల తెగి వేలాడుతున్నా కొద్దిసేపు పోరాడిన 'మాటడార్', ఆ తర్వాత బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముందు బోర్లా పడింది. దాంతో దాని తల శరీరం కింద నలిగిపోయి పూర్తిగా విడిపోయింది. మళ్లీ లేవడానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక లోపంతో అది అక్కడే కూలిపోయింది. ప్రత్యర్థి పూర్తిగా కుప్పకూలడంతో 'వైట్ ఈగిల్' రోబోను విజేతగా ప్రకటించారు. ఈ క్రమంలో వైట్ ఈగిల్ రింగ్‌లోనే రకరకాల డ్యాన్స్ స్టెప్పులు, విక్టరీ ఫోజులతో వేడుకలు చేసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వినూత్న టోర్నమెంట్ భవిష్యత్తులో రోబోటిక్స్ సాంకేతికత ఏ స్థాయికి చేరబోతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మను మెస్సితో పోల్చిన టీమిండియా మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌కు కాంస్యం.. ఫ్రాన్స్‌పై 6-4తో ఘన విజయం