టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన బీసీసీఐ
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:23 PM
మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ నిర్ణయాత్మక, చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌కు సర్వంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య ఇవాళ నిర్ణయాత్మక, చివరి వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ కీలక పోరుకు ముందు లండన్‌లోని భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక సమ్మేళనంలో భారత ఆటగాళ్లు పాల్గొని సందడి చేశారు. ఇక మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. 'భారత్‌లో 99 శాతం మంది ప్రజలు క్రికెట్ నిపుణులే. కాబట్టి మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా మంచిది. టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు, మీ ఆటపైనే మీరు దృష్టి పెట్టండి' అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భారత టెస్టు, వన్డేల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఒత్తిడిని అధిగమించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మైదానం లోపల, వెలుపల ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను బయట అంశాలకు వీలైనంత దూరంగా ఉంటాను. నా నియంత్రణలో ఉన్న విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడం నాకు ఒత్తిడిని జయించడంలో సహాయపడుతుంది' అని గిల్ పేర్కొన్నాడు.
మరోవైపు ఇటీవల గాయాల బారిన పడి కోలుకున్న భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు సహచర ఆటగాళ్లు చేసిన ఫోన్ కాల్స్, ఇచ్చిన భరోసా త్వరగా కోలుకుని బలమైన పునరాగమనం చేయడానికి ఎంతో ప్రేరణనిచ్చాయంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత డిప్యూటీ హైకమిషనర్ కార్తీక్ పాండే పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకమిషనర్ పి. కుమారన్ భారత జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఈ వారంలోనే అమలులోకి వచ్చిన భారత్-యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) ప్రభావం గురించి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు!
తల తెగినా పోరాటం ఆపని రోబో.. వీడియో వైరల్!