Share News

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:27 PM

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు ఈరోజు (ఆదివారం) వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు.

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..
Jammu and Kashmir Floods

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు ఈరోజు (ఆదివారం) వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతుల్లో భారీ వర్షాల కారణంగా పూంచ్ జిల్లాలో ఇల్లు కూలి ముగ్గురు మరణించగా.. రాజౌరిలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గల్లంతైన ఐదుగురి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.


రాజౌరి జిల్లాలోని దర్హాలి, ఖండ్లీ, సుక్తోహ్, జమోలా నదులతో సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాటిలో చాలా వరకు ప్రమాదకర స్థాయికి చేరి అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాజౌరి పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది. దర్హాలి నదికి వరద పోటెత్తగా బేలా కాలనీ సమీపంలోని రక్షణ గోడ కూలిపోయింది. దీంతో కొత్త బస్టాండ్ ఆవరణలోకి వరద నీరు దూసుకొచ్చి డజన్ల కొద్దీ వాహనాలు కొట్టుకుపోయాయి. అబ్దుల్లా వంతెన సమీపంలోని మురికివాడ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతంలోకి వరద నీరు ప్రవేశించడంతో 50కి పైగా కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. తారిఖ్ వంతెన సమీప ప్రాంతాన్నీ వరద నీరు ముంచెత్తింది. దీంతో పోలీసులు, అత్యవసర సిబ్బంది స్థానికులను నదీ తీర ప్రాంతానికి దూరంగా తరలించారు. అలాగే, నదీ తీరం, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.


కాగా, జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జులై 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో రియాసిలో అత్యధికంగా 106 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజౌరిలో 103 మి.మీ., ఉధంపూర్‌లో 101.6 మి.మీ., కత్రాలో 85 మి.మీ., పూంచ్‌లో 77 మి.మీ. బటోటేలో 57.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

Updated Date - Jul 19 , 2026 | 12:53 PM