Share News

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు..

ABN , Publish Date - Jul 19 , 2026 | 10:28 AM

ఓ తండ్రి రాసుకున్న పాత డైరీ ఇప్పుడు వేలాది మందిని ఆలోచింపజేస్తోంది. అశుతోష్ ప్రతిహస్త్ అనే వ్యక్తి తన తండ్రి దాదాపు పదేళ్ల కిందట రాసుకున్న డైరీని చదువుతూ తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలోని వారి సంభాషణ, డైరీలోని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు..
Father Gratitude Diary Viral

న్యూఢిల్లీ: ఓ తండ్రి రాసుకున్న పాత డైరీ ఇప్పుడు వేలాది మందిని ఆలోచింపజేస్తోంది. అశుతోష్ ప్రతిహస్త్ అనే వ్యక్తి తన తండ్రి దాదాపు పదేళ్ల కిందట రాసుకున్న డైరీని చదువుతూ తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలోని వారి సంభాషణ, డైరీలోని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో అశుతోష్ తన తండ్రిని ఈ డైరీ ఎప్పుడు రాశారని అడగగా దాదాపు తొమ్మిది, పది సంవత్సరాల క్రితమని ఆయన సమాధానం ఇచ్చారు.


అశుతోష్ తండ్రి డైరీలోని ప్రతి పేజీలోనూ ఆయన తన జీవితంలో కలిగి ఉన్న చిన్న చిన్న సౌకర్యాలకే కృతజ్ఞత తెలిపిన విషయాలు కనిపించాయి. 'వేసవిలో చల్లటి నీళ్లు తాగేందుకు ఫ్రిజ్ ఉంది.. అందుకు నేను అదృష్టవంతుడిని' అని ఆయన రాశారు. అలాగే 'నా భార్య అనవసర ఖర్చులు చేయదు, నాతో గొడవ పడదు. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంది. మా ఇద్దరు పిల్లలు చదువులో మంచి పేరు తెచ్చుకున్నారు' అంటూ కుటుంబం గురించీ కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఇది చూసిన అశుతోష్.. 'ఇలాంటి విషయాలన్నీ ఎందుకు రాశారు?' అని తండ్రిని ప్రశ్నించారు. దీనికి ఆయన 'ది సీక్రెట్' అనే పుస్తకం చదివిన తర్వాత కృతజ్ఞత శక్తి గురించి తెలుసుకున్నానని చెప్పారు.


డైరీలో మరోచోట 'ఇంట్లో రెండు కుర్చీలు ఉన్నాయి.. అందరం కలిసి కూర్చొని టీ తాగగలం. రెండు దుప్పట్లు ఉన్నాయి.. అందుకు కూడా కృతజ్ఞుడిని' అని రాసి ఉండటం చూసి కుమారుడు ఆశ్చర్యపోయాడు. అంతేకాదు.. ఆ డైరీలో అప్పట్లో తనకు లేని, కొనాలని భావించిన వస్తువుల జాబితా కూడా ఉంది. ప్రెషర్ కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, ఫ్రైయింగ్ పాన్, షోకేస్, బీరువా, సోఫా, సోఫా టేబుల్, వై-ఫై వంటి వస్తువులు కావాలని అందులో రాశారు. దీనిపై అశుతోష్ తండ్రి మాట్లాడుతూ.. 'ఆ రోజుల్లో నేను కృతజ్ఞతతో రాసుకున్నవే తర్వాత నా కలల జాబితాగా మారాయి. అందులో రాసుకున్న చాలా విషయాలు కాలక్రమంలో నిజమయ్యాయి' అని తెలిపారు.


వీడియో చివరిలో డైరీలోని ఓ వాక్యాన్ని అశుతోష్ చదివి వినిపించారు. 'ఒకటి ఇస్తే అన్నీ వస్తాయి. ఆ ఒక్కటి ఇవ్వకపోతే ఉన్నవీ పోవచ్చు' అని అందులో ఉంది. ఆ ఒక్కటి ఏమిటో అడగగా... 'అది కృతజ్ఞత' అని తండ్రి సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మన దగ్గర ఉన్న వాటి విలువను గుర్తించడం కూడా గొప్ప సంపదే అని, చిన్న విషయాలకు కృతజ్ఞత చెప్పడం జీవితాన్ని సంతోషంగా మారుస్తుందని కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ కాలనీలో...ఇంటికో విమానం!

తండ్రిని కాపాడిన తనయుడు! వరద నీటిలో 3 గంటల పాటు ఈది..

Updated Date - Jul 19 , 2026 | 11:27 AM