తండ్రిని కాపాడిన తనయుడు! వరద నీటిలో 3 గంటల పాటు ఈది..
ABN , Publish Date - Jul 19 , 2026 | 08:47 AM
పోటెత్తుతున్న వరద నీటిలో మూడు గంటల పాటు ఆగకుండా ఈత కొట్టి తండ్రిని కాపాడిన ఒక తనయుడి ఉదంతం చైనాలో తాజాగా వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: పోటెత్తుతున్న వరద నీటిలో మూడు గంటల పాటు ఆగకుండా ఈత కొట్టి తండ్రిని కాపాడిన ఒక తనయుడి ఉదంతం చైనాలో తాజాగా వెలుగు చూసింది. కంటికి రెప్పలా తండ్రిని కాపాడుకున్న ఆ యువకుడిపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చైనాలో గ్వాంగ్జీ అటానమస్ ప్రావిన్స్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వరదలతో పాటు ఒక డ్యామ్ కూడా కూలిపోవడంతో 39 మంది మరణించారు. దాదాపు 4 లక్షల మంది ఇక్కట్ల పాలయ్యారు. ఇదిలా ఉంటే, ఆ ప్రాంతంలోనే ఒక యువకుడి కుటుంబం కొండపై ఉన్న ఇంట్లో నివసిస్తోంది. కొండ కింద వారికి మరో ఇల్లు కూడా ఉంది. అక్కడే యువకుడి తండ్రి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల ధాన్యాన్ని అక్కడే నిల్వచేశారు. అయితే, వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో ధాన్యం నిల్వలు మొత్తం నీట మునిగిపోయే పరిస్థితి నెలకొంది.
దీంతో, యువకుడి తండ్రి కొండ దిగి కిందకు వచ్చాడు. ధాన్యం మొత్తాన్ని పైఅంతస్తుకు చేరుస్తుండగా ఒక్కసారిగా వర్షం పెరిగింది. ఆ రాత్రి బీభత్సంగా వర్షం కురవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సెల్‌ఫోన్స్ సిగ్నల్స్‌కు కూడా అంతరాయం ఏర్పడటంతో యువకుడి తల్లి తన భర్తతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. భర్తకు ఏమైందో అని గాబరా పడిపోయిన తల్లి వెంటనే సమీపంలోని టౌన్‌లో ఉంటున్న తన కొడుకుకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
ఇది విని తనయుడు కూడా గాబరా పడిపోయాడు. రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. మరుసటి రోజు తండ్రిని కాపాడేందుకు నిశ్చయించుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి వరద నీటిలో ఈదుతూనే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తండ్రిని చేరుకోగలిగాడు. అక్కడికి వెళ్లాక తండ్రి పైఅంతస్తులో క్షేమంగానే కనిపించడంతో స్థిమితపడ్డాడు. ఆ తరువాత ఆయనను జాగ్రత్తగా కిందకు దించి మరో మార్గంలో కొండమీద ఉన్న ఇంటికి చేర్చాడు. భర్తను చూడగానే యువకుడి తల్లికి కూడా ప్రాణాలు లేచొచ్చినంత పనైంది. భర్త క్షేమంగా తిరిగి రావడంతో భావోద్వేగం అణుచుకోలేక కన్నీటిపర్యంతమైంది.
ఈ వార్తలనూ చదవండి:
నాకు ఇక పెళ్లి కాదేమో.. యువ సర్జన్ ఆవేదన
రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఫోన్‌లో ముచ్చట్లు.. అంతలోనే వచ్చిన రైలు..