కోహ్లీ-గంభీర్ మధ్య విభేదాలు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశారుగా!
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:48 PM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇద్దరి మధ్య సఖ్యత లేదంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తాజాగా ఓ ఫొటోతో ఆ ఇద్దరూ సమాధానం ఇచ్చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇద్దరి మధ్య సఖ్యత లేదంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తాజాగా ఓ ఫొటోతో ఆ ఇద్దరూ సమాధానం ఇచ్చేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన కార్యక్రమంలో కోహ్లీ, గంభీర్ పక్కపక్కనే కూర్చుని సరదాగా నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లండ్ పర్యటన సమయంలో కోహ్లీ-గంభీర్ మధ్య సంబంధాలపై పలు ఊహాగానాలు వినిపించాయి. నెట్స్‌లో ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని, దాంతో భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం సరిగా లేదని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే భారత హైకమిషన్ కార్యక్రమంలో కనిపించిన దృశ్యాలు అందుకు భిన్నమైన సందేశాన్ని ఇచ్చాయి. ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ కనిపించడంతో ఆ పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

లార్డ్స్‌లోనూ మాట్లాడుకున్నారు..
పుకార్లు చెలరేగిన కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో కోహ్లీ, గంభీర్ కలిసి చర్చించుకుంటూ కనిపించారు. మూడో వన్డే టాస్‌కు ముందు బౌండరీ లైన్ దగ్గర ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడం కెమెరాల్లో నమోదైంది. ఇదే సమయంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా వారిద్దరి మధ్య విభేదాల వార్తలను కొట్టిపారేశారు. ‘విరాట్, గౌతమ్ ఈరోజే దాదాపు పదిసార్లు మాట్లాడుకున్నారు. వాళ్ల మధ్య వారధిగా ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. ఈ పుకార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. కానీ అవి వస్తూనే ఉంటాయి’ అని కోటక్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!
జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం