Share News

ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:49 PM

ఫిఫా ఫైనల్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య టైటిల్ పోరుతో పాటు మరో ఆసక్తికరమైన సమరం కూడా సాగనుంది. అదే గోల్డెన్ బూట్ రేసు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె మధ్య అత్యధిక గోల్స్ అవార్డు కోసం పోటీ తారస్థాయికి చేరింది.

ఫిఫా గోల్డెన్ బూట్ రేసు.. ఎంబాపెను మెస్సి అధిగమించాలంటే..!
Lionel Messi, Kylian Mbappe

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య టైటిల్ పోరుతో పాటు మరో ఆసక్తికరమైన సమరం కూడా సాగనుంది. అదే గోల్డెన్ బూట్ రేసు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె మధ్య అత్యధిక గోల్స్ అవార్డు కోసం పోటీ తారస్థాయికి చేరింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై రెండు గోల్స్ చేసిన ఎంబాపె.. ఈ ప్రపంచ కప్‌లో తన గోల్స్ సంఖ్యను పదికి పెంచుకున్నాడు. ఫ్రాన్స్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించినా.. గోల్డెన్ బూట్ రేసులో మాత్రం అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు మెస్సి ఖాతాలో ప్రస్తుతం 8 గోల్స్, 4 అసిస్టులు ఉన్నాయి. దీంతో ఫైనల్‌లో మెస్సి ఎలా గోల్డెన్ బూట్ రేసులో గెలవగలడనే చర్చ ఆసక్తికరంగా మారింది.


మెస్సి గోల్డెన్ బూట్ గెలవాలంటే...

మెస్సి గోల్డెన్ బూట్‌ను సొంతం చేసుకోవాలంటే అత్యంత సులభమైన మార్గం ఫైనల్‌లో హ్యాట్రిక్ నమోదు చేయడం. అలా చేస్తే అతని గోల్స్ సంఖ్య 11కు చేరుతుంది. అప్పుడు ఎంబాపె 10 గోల్స్‌ను అధిగమించి మెస్సి నేరుగా గోల్డెన్ బూట్ విజేతగా నిలుస్తాడు. అయితే ఇంకో అవకాశం కూడా ఉంది.. ఫైనల్‌లో మెస్సి రెండు గోల్స్ చేయడంతో పాటు ఒక అసిస్టు అందిస్తే కూడా గోల్డెన్ బూట్ అతని ఖాతాలో పడుతుంది. అప్పుడు మెస్సి, ఎంబాపె ఇద్దరికీ చెరో 10 గోల్స్ ఉంటాయి. అయితే ఫిఫా టై బ్రేకర్ నిబంధనల ప్రకారం గోల్స్ సమానంగా ఉంటే ఎక్కువ అసిస్టులు చేసిన ఆటగాడికే గోల్డెన్ బూట్ దక్కుతుంది. ప్రస్తుతం ఇద్దరికీ నాలుగు అసిస్టులు ఉండగా.. మరో అసిస్టుతో మెస్సి మొత్తం ఐదుకు చేరుకుంటాడు. దీంతో ఎంబాపెపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.


మెస్సిపై ఎంబాపె ప్రశంసలు

తన ప్రపంచ కప్ గోల్స్ రికార్డును అధిగమించినప్పటికీ.. ఫైనల్‌లో మెస్సి మళ్లీ ఆ రికార్డును తిరిగి స్వాధీనం చేసుకుంటాడనే నమ్మకం తనకు ఉందని ఎంబాపె తెలిపాడు. ‘లియో ఎప్పుడూ గోల్స్ చేస్తూనే ఉంటాడు. స్పెయిన్‌తో ఫైనల్‌లో కూడా అతను తప్పకుండా గోల్ చేస్తాడని నమ్ముతున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో ఎంబాపె అన్నాడు. మరికొద్ది గంటల్లో ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఫుట్‌బాల్ అభిమానులు దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పెయిన్‌తో జరిగే తుది సమరంలో మెస్సి తన జట్టుకు ప్రపంచకప్ అందించడంతో పాటు గోల్డెన్ బూట్ రేసులోనూ ఎంబాపెను అధిగమిస్తాడా? లేక ఎంబాపె అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?

Updated Date - Jul 19 , 2026 | 05:50 PM