రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:38 PM
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ భవిష్యత్తుపై వస్తోన్న అనుమానాలకు ఈ ఇన్నింగ్స్ గట్టి సమాధానమని రవి శాస్త్రి పేర్కొన్నాడు. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలుకనున్నాడంటూ నెట్టింట వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లోనూ అతడికి స్థానం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ సెంచరీ చేసి అందరికీ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడంటూ రవి శాస్త్రి వెల్లడించాడు.
‘రోహిత్ శర్మ ప్రత్యేకంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతడిపై వస్తోన్న పుకార్లు, విమర్శలకు బ్యాట్‌తోనూ సమాధానం చెప్పాడు. తన సెంచరీతో అందరి నోళ్లు మూయించాడు. అయినా ఇలాంటి పుకార్లు వస్తే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అతడికి ఇంకా ఆడాలనే కోరిక, ఆటపై ఆసక్తి, కష్టపడే తపన ఉంటే.. ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆడే అవకాశం ఇవ్వాలి. ఒక రోజు రోహిత్ స్వయంగా జట్టును వీడేందుకు సరైన సమయం ఇదేనంటూ భావిస్తాడు. అప్పుడు మాత్రమే అతడు రిటైర్‌మెంట్ ఇవ్వాలి. ఇలాంటి నాణ్యమైన ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలనుకునే సమయంలో అతడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ప్రత్యేకం. లార్డ్స్‌లో వచ్చిన ఈ వన్డే సెంచరీ చాలా గొప్పది’ అని శాస్త్రి ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి:
అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది? మెస్సి వీడియో వైరల్
హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్