Share News

ఫిఫా విజేతలకు భారీ జాక్‌పాట్.. స్పెయిన్ ప్లేయర్లకు రూ.8.32 కోట్ల చొప్పున బోనస్!

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:42 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు భారీ జాక్‌పాట్ తగిలింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు 7.56 లక్షల యూరోలు(సుమారు రూ.8.32 కోట్లు) బోనస్‌గా అందనున్నట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది.

ఫిఫా విజేతలకు భారీ జాక్‌పాట్.. స్పెయిన్ ప్లేయర్లకు రూ.8.32 కోట్ల చొప్పున బోనస్!
Spain FIFA World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు భారీ జాక్‌పాట్ తగిలింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు 7.56 లక్షల యూరోలు(సుమారు రూ.8.32 కోట్లు) బోనస్‌గా అందనున్నట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. ఫిఫా ఫైనల్‌లో అర్జెంటీనా జట్టుపై 1-0 తేడాతో గెలిచిన స్పెయిన్.. రెండోసారి ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.


ప్రపంచ కప్ విజేతగా నిలవడంతో ఫిఫా నుంచి స్పానిష్ ఫుట్‌బాల్ సమాఖ్యకు 50 మిలియన్ డాలర్లు(రూ.481 కోట్లు) ప్రైజ్ మనీ లభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్ హోదాతో స్పాన్సర్‌షిప్ ఆదాయం, టెలివిజన్ ప్రసార హక్కుల విలువ కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్పెయిన్ జాతీయ జట్టుకు ప్రయాణం, బీమా, టెలికమ్యూనికేషన్, క్రీడా సామగ్రి, ఇంధనం, ఆహార, పానీయాల వంటి రంగాలకు చెందిన 35 సంస్థలు స్పాన్సర్లుగా ఉన్నాయి. ప్రపంచకప్ విజయంతో వీటి విలువ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


ఇక జట్టు అధికారిక జెర్సీల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా స్పెయిన్ జెర్సీలు దేశవ్యాప్తంగా పూర్తిగా విక్రయాలు చేసినట్లు సమాచారం. విదేశాల్లోనూ వీటి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైజ్ మనీతో పాటు ప్రతి ఆటగాడికి ప్రపంచ కప్ విజేత పతకం, ప్రత్యేక రింగ్ కూడా అందజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది? మెస్సి వీడియో వైరల్

హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

Updated Date - Jul 21 , 2026 | 04:42 PM