అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:47 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు కోల్పోయినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఓదార్చినా.. ఆ సమయంలో అవన్నీ పట్టించుకోలేక పోయానని వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘నిజం చెప్పాలంటే ఆ రోజు రోహిత్ శర్మ చెప్పిన మాటలను నేను నమ్మలేదు. దానికి ఇప్పుడు సారీ చెబుతున్నా. తన అనుభవంతో, మనస్ఫూర్తిగా అతడు మాట్లాడి ఉండొచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్లో రోహిత్ చెప్పిన మాటలను నేను పట్టించుకోలేకపోయాను. నా ముఖంలోనే ఆ నిరాశ స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ప్రపంచ కప్ ప్రారంభం అయింది. జట్టులో చోటు లేదనే నిరాశ నుంచి వెంటనే బయట పడలేకపోయాను. ఏదైనా నిరాశ ఎదురైతే దాని నుంచి కోలుకోవడానికి నాకు కనీసం వారం రోజులు పడుతుంది. బాధను దాచుకునే వ్యక్తిని కాదు. అందుకే నా ముఖంలోనే అది స్పష్టంగా కనిపిస్తుంది’ అని వివరించాడు.
అదే నా ఆలోచనకు కారణం..
‘విఫలమవుతున్నానని తెలుసు.. ఇక అక్కడి నుంచి పైకే లేవాలని నిశ్చయించుకున్నా. అప్పుడే నన్ను నేను ప్రశ్నించుకోవడం ప్రారంభించాను. నేను క్రికెట్ ఎందుకు ఆడుతున్నాను? నా లక్ష్యం ఏమిటి? అనే విషయాలపై ఆలోచించాను. ప్రపంచకప్ జరుగుతుండగానే నా సామర్థ్యం ఏంటో గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత అన్నీ మళ్లీ సవ్యంగా జరిగాయి. జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ మ్యాచ్‌కు ఎంతో మెరుగ్గా సిద్ధమయ్యాను. కొన్ని రోజులు మనకు అన్నీ అనుకూలంగా సాగుతాయి. ఆ మ్యాచ్‌లో నేను సెంచరీ చేయకపోయినా.. మంచి అనుభూతి కలిగింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ తదుపరి మ్యాచ్‌లకు సిద్ధమయ్యాను’ అని సంజు తెలిపాడు.
ఆ మ్యాచ్ ఇన్నింగ్స్ అనంతరం చేసిన సెలబ్రేషన్ వెనుక ఉన్న కారణంపై కూడా సంజు మాట్లాడాడు. ‘అది నా వ్యక్తిగత వేడుక. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది. నాకు దేవుడిపై ఎంతో విశ్వాసం ఉంది. ఆ ఇన్నింగ్స్ నేను ఆడాననే భావన కంటే, దేవుడు నా ద్వారా ఆడించాడనే భావనే ఎక్కువగా ఉంది. కొన్ని షాట్లు ఎలా ఆడానో నాకు కూడా ఆశ్చర్యమే. జట్టుకు ఉపయోగపడగలిగినందుకు ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఆ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని సంజు శాంసన్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది? మెస్సి వీడియో వైరల్
హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్