Share News

క్వాలిఫయర్ 2: గుజరాత్‌పై రాజస్థాన్ నెగ్గుతుందా?.. సమీకరణాలు ఇలా!

ABN , Publish Date - May 28 , 2026 | 01:45 PM

ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

క్వాలిఫయర్ 2: గుజరాత్‌పై రాజస్థాన్ నెగ్గుతుందా?.. సమీకరణాలు ఇలా!
GT vs RR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఫైనల్ బెర్తు కోసం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు.. ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అయితే ఎలిమినేటర్‌లో బలమైన ఎస్ఆర్‌హెచ్‌ను ఓడించిన రాజస్థాన్.. భీకర ఫామ్‌లో ఉంది. మరోవైపు క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్.. మరో అవకాశం దక్కించుకుని విజయం కోసం ఎదురుచూస్తుంది. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..


ఈ రెండు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్‌దే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇరుజట్లు 10 సార్లు తలపడ్డాయి. అందులో గుజరాత్ 7 సార్లు విజయం సాధించగా.. రాజస్థాన్ కేవలం మూడింట్లోనే గెలుపొందింది. మరి క్వాలిఫయర్ 2లో గుజరాత్‌పై రాజస్థాన్‌ నెగ్గుతుందా? ఓటమి సెంటిమెంట్‌ను చెరిపేస్తుందేమో చూడాల్సి ఉంది. కాగా ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏ మ్యాచులోనూ ఓడిపోలేదు. క్వాలిఫయర్ 2కి కూడా ఇదే వేదిక కావడం.. ఆర్ఆర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ భీకర ఫామ్‌లో ఉండటంతో గుజరాత్ గెలుపు అంత సులువు కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. 243 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఆ స్కోర్‌ను డిఫెండ్ చేసుకుని ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తుగా ఓడించి క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది.


అక్కడ సాయి సుదర్శన్.. ఇక్కడ వైభవ్!

టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత గాడి తప్పింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబైపై తప్పక గెలవాల్సిన పోరులో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్‌కు చేరింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్‌ను ఎలిమినేటర్‌లో చిత్తు చేసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దూకుడుకు చెక్ పెట్టగలిగితేనే గుజరాత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. సిరాజ్, హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు విజృంభిస్తున్నారు. వైభవ్ విధ్వంసాన్ని గుజరాత్ బౌలర్లు కట్టడి చేస్తారా? ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ రాజస్థాన్ ఫైనల్ చేరుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది. కాగా ఈ పోరులో నెగ్గిన జట్టు ఆదివారం ఆర్సీబీతో ఫైనల్ సమరంలో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 28 , 2026 | 02:43 PM