Share News

భారత్-పాక్ వివాదం.. మూడు డిమాండ్లను ఐసీసీ ముందుంచిన పీసీబీ!

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:26 AM

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయంపై పాకిస్థాన్ వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ.. ఐసీసీ ముందు మూడు కీలక డిమాండ్లు ఉంచినట్లు సమాచారం.

భారత్-పాక్ వివాదం.. మూడు డిమాండ్లను ఐసీసీ ముందుంచిన పీసీబీ!
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయంపై పాకిస్థాన్ వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ.. ఐసీసీ ముందు మూడు కీలక డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ(ICC) హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆదివారం లాహోర్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పీసీబీ మూడు షరతులు పెట్టింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) ఛైర్మన్ అమీనుల్ ఇస్లాం కూడా పాల్గొన్నారు.


1. ఆర్థిక వాటా..

ప్రపంచ క్రికెట్‌లో తమ వంతు పాత్ర పెరిగిందని పేర్కొంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఎక్కువ ఆర్థిక వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. మౌలిక వసతుల అభివృద్ధి, యువ ఆటగాళ్లకు శిక్షణ, జట్టు స్థాయి మెరుగుదలకు అదనపు నిధులు అవసరమని వాదిస్తోంది.


2. పార్టిసిపేషన్ ఫీజు మంజూరు

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించినప్పటికీ కనీసం పార్టిసిపేషన్ ఫీజును ఐసీసీ చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేసింది. టోర్నీకి ముందు సన్నాహాలకు భారీగా ఖర్చు అవుతుందని, ఫలితాలతో సంబంధం లేకుండా ఆర్థిక భద్రత కల్పించాలన్నది వారి వాదన.


3. ఐసీసీ టోర్నీకి ఆతిథ్య హక్కులు:

రాబోయే ఏదైనా ఒక ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్‌కు ఇవ్వాలని పీసీబీ కోరుతోంది. ప్రస్తుతం బంగ్లాలో మౌలిక సదుపాయాలు, ప్రేక్షకాదరణ తగిన స్థాయిలో ఉన్నాయని పెద్ద టోర్నీ నిర్వహణకు దేశం సిద్ధంగా ఉందని అభిప్రాయపడుతోంది.


ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై పీసీబీనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఇంకా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. తుది నిర్ణయం కోసం ఆయన సోమవారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మరోసారి కలవనున్నట్లు తెలుస్తోంది. పాక్ మనసు మార్చుకొని మ్యాచ్‌ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తుందని ఐసీసీ అధికారులు ఆశిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 12:15 PM