Share News

మెస్సిని ఇంటర్వ్యూ చేసిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 18 , 2026 | 03:41 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఓ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశాడు.

మెస్సిని ఇంటర్వ్యూ చేసిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్.. వీడియో వైరల్
Novak Djokovic

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు ఒకే వేదికపై కలిస్తే.. ఆ సంభాషణలో ప్రత్యేకత ఉండాల్సిందే. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు అలాంటి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఓ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా జకోవిచ్ అడిగిన ఓ ప్రశ్నకు మెస్సి ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ప్రపంచ స్థాయి పోటీల్లో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్న జకోవిచ్.. మెస్సిని కూడా అదే అంశంపై ప్రశ్నించాడు. ‘ఒత్తిడిని పక్కన పెట్టి మీ సహజమైన ఆటతీరును ఎలా కొనసాగించగలుగుతున్నారు?’ అని జకోవిచ్ మెస్సిని అడిగాడు. ‘ఒత్తిడి గురించి నేను ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. మైదానంలోకి వెళ్లడం, ఆటను ఆస్వాదించడం, పోటీ పడటం సహజమైన విషయాలుగా భావించాను. మేం ఎప్పుడూ గెలవాలని కోరుకుంటాం. కానీ ఇది ఒక ఆట అని కూడా తెలుసు. ప్రత్యర్థి కూడా ఆడతాడు. ప్రతిసారీ ఒకే వ్యక్తి, ఒకే జట్టు విజయం సాధించడం సాధ్యం కాదు’ అని మెస్సి సమాధానం ఇచ్చాడు.


అదే ఎదుగుదలకు కారణం..

కెరీర్‌లో ఓటములను అంగీకరించడం నేర్చుకోవాలని మెస్సి తెలిపాడు. అదే తనను ఆటగాడిగా, వ్యక్తిగా మరింత బలంగా మార్చిందని వెల్లడించాడు. ‘కాలక్రమేణా ఒక విషయం అర్థమైంది. క్రీడల్లో మీరు గెలిచే దాని కంటే ఓడిపోయే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల నేను ఆటగాడిగా, వ్యక్తిగా ఎదగగలిగాను’ అని మెస్సి పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో మెస్సి.. జకోవిచ్‌తో పాటు అమెరికన్ ఫుట్‌బాల్ దిగ్గజం టామ్ బ్రాడీ, ఎన్బీఏ స్టార్ కెవిన్ డ్యురాంట్ వంటి ప్రముఖులతో కూడా ముచ్చటించాడు. ఇక మెస్సి ఇప్పుడు ఫిఫా వరల్డ్‌ కప్ 2026 ఫైనల్‌లో బరిలోకి దిగనున్నాడు. జులై 19న న్యూయార్క్‌లో జరిగే టైటిల్ పోరులో అర్జెంటీనా.. స్పెయిన్‌ను ఎదుర్కోనుంది.


ఇవి కూడా చదవండి:

మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్

ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్

Updated Date - Jul 18 , 2026 | 03:41 PM