ఐపీఎల్ 2027 వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్.. బంగ్లాదేశ్ బోర్డు కీలక ప్రకటన!
ABN , Publish Date - Nov 11 , 2026 | 09:05 PM
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మరోసారి ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 2027 వేలంలో తన పేరును నమోదు చేసుకోనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ మరోసారి ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 2027 వేలంలో తన పేరును నమోదు చేసుకోనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వర్గాలు వెల్లడించాయి. పలు వివాదాల కారణంగా ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అతడిని జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కొత్త ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకోవాలని ముస్తాఫిజుర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ వేలంలో పాల్గొనాలని ముస్తాఫిజుర్ ఆసక్తి వ్యక్తం చేయడంతో బీసీబీ అతడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అతడితో పాటు మరో ఆరుగురు బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోనున్నట్లు బోర్డు వెల్లడించింది. వారిలో నహిద్ రాణా, రిషాద్ హొస్సేన్, హసన్ మహ్మద్, తౌహిద్ హృదోయ్, తస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం ఉన్నారు.
వివాదం.. కేకేఆర్ నుంచి విడుదల!
ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026 వేలంలో రూ.9.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్లో ఆడించనుండటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. బంగ్లా పేసర్‌ను రీలీజ్ చేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీని ఆదేశించింది. దీంతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ పరిణామం బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య వివాదానికి దారితీసింది. చివరకు 2026 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనే అంశంపైనా ప్రభావం చూపింది. బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవడంతో స్కాట్లాండ్కు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?