ప్రపంచ ఛాంపియన్‌షిప్: భారత షూటర్ నీరజ్‌కు కాంస్యం.. ఒలింపిక్స్‌కు అర్హత
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:41 PM
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు భారత షూటర్ నీరజ్ కుమార్ అర్హత సాధించాడు. బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత షూటింగ్‌లో మరో అద్భుతం నమోదైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు భారత షూటర్ నీరజ్ కుమార్ అర్హత సాధించాడు. బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ కోటాను ఖాయం చేసుకున్నాడు. ఫైనల్లో 346.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన రెండో ఒలింపిక్ కోటా ఇదే కావడం విశేషం. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా రజతం సాధించి తొలి కోటాను అందించాడు.
50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో నీరజ్ అద్భుతంగా పోరాడాడు. ఒక దశలో రజత పతకం సాధించే అవకాశాలు కనిపించినప్పటికీ.. 34వ షాట్‌లో 9.4 స్కోరు చేయడంతో మూడో స్థానానికి పడిపోయాడు. స్లోవేకియాకు చెందిన పాట్రిక్ జానీ రజత పతకాన్ని దక్కించుకోగా.. ఇండివిడ్యువల్ న్యూట్రల్ అథ్లెట్ (AIN) దిమిత్రి పిమెనోవ్ 362.8 పాయింట్లతో ప్రపంచ జూనియర్ రికార్డు నమోదు చేసి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఈ ముగ్గురూ లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు కోటా స్థానాలు సాధించారు. ఇదే ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు కాంస్యం!
వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ ఈవెంట్‌లోనూ భారత షూటర్లు సత్తా చాటారు. నీరజ్ కుమార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షియోరాన్ కలిసి ఎలిమినేషన్ రౌండ్‌లో మొత్తం 1,751 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నారు. చెక్ రిపబ్లిక్ 1,754 పాయింట్లతో స్వర్ణం సాధించగా.. నార్వే 1,752 పాయింట్లతో రజతం గెలుచుకుంది. కేవలం ఒక్క పాయింట్ తేడాతో భారత్ రజతాన్ని కోల్పోయింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?