అది రోహిత్ శర్మనేనా?.. కెప్టెన్సీపై ముంబై ఇండియన్స్ క్రేజీ హింట్!
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:10 PM
ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. వచ్చే సీజన్‌లో జట్టు కెప్టెన్ ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. వచ్చే సీజన్‌లో జట్టు కెప్టెన్ ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది. దీంతో ఐదుసార్లు ముంబైకి టైటిళ్లు అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. ముంబై ఇండియన్స్ బుధవారం ఓ యానిమేటెడ్ చిత్రాన్ని షేర్ చేసింది. అందులో ముంబై క్యాప్‌ను పట్టుకున్న ఓ చేయి కనిపిస్తోంది. ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోయినా.. ఈ పోస్టు వెనుక రోహిత్ శర్మ ఉన్నాడంటూ అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ముంబై ఫ్రాంచైజీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జెండాను చేతబట్టి రోహిత్ సంబరాలు చేసుకున్న దృశ్యాన్ని ఈ ఫొటో పోలినట్లు ఉందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో 2013లో ముంబై ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు కెప్టెన్‌గా రోహిత్ చేసిన సంబరాలను గుర్తుచేస్తున్నారు. హార్దిక్ పాండ్య ట్రేడ్ డీల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరడంతో కెప్టెన్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో వచ్చే సీజన్‌లో జట్టుకు నాయకత్వం వహించేది ఎవరనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ ముంబై యాజమాన్యం తిరిగి రోహిత్ శర్మకే జట్టు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియా పోస్టుతోనే కెప్టెన్ ఎవరనేది ఖరారైనట్లు భావించలేం. మరి అభిమానులు ఆశిస్తున్నట్లుగా హిట్‌మ్యాన్ మళ్లీ ముంబై పగ్గాలు చేపడతాడా? అన్నది తెలియాలంటే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్