సిరాజ్‌ను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: రాజీవ్ శుక్లా
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:04 PM
న్యూజిలాండ్‌తో డ్రాగా ముగిసిన తొలి టెస్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. సిరాజ్‌ను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో డ్రాగా ముగిసిన తొలి టెస్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మ్యాచ్‌లో చివరి రోజు భారత బౌలర్లు ఎనిమిది వికెట్లు పడగొట్టలేకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. కివీస్‌తో తొలి టెస్టుకు సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి మతపరమైన కోణాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ విమర్శలు చేయడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. సిరాజ్‌ను అనవసర వివాదాల్లోకి లాగొద్దని సూచించాడు.
‘సిరాజ్ ఆడకపోవడం వల్లే టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిందని చెప్పలేం. సిరాజ్‌ను ఇలాంటి రాజకీయ వివాదాల్లోకి లాగకూడదు. అతడి చుట్టూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. అతను భారత జట్టులో భాగంగా ఉన్నాడు. అసలు జట్టుకు ఎంపిక కావడమే ఒక ఆటగాడికి గొప్ప విషయం. జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం కోచ్, కెప్టెన్‌దే. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారు తుది నిర్ణయం తీసుకుంటారు. ఒక ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కలేదని రాజకీయ లేదా ఇతర వివాదాలను సృష్టించడం తగదు. ఇది సిరాజ్‌కు కూడా మంచిది కాదు. అతను కూడా ఇలాంటి వివాదాలను కోరుకోడు’ అని స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్