ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?
ABN , Publish Date - Aug 25 , 2026 | 03:26 PM
ధోని–సీఎస్కే బంధంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సీఎస్కేలో వాటా కొనుగోలు చేయాలని ధోని భావించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ధోని, సీఎస్కే యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నైతోనే కొనసాగుతున్న ధోని.. ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. అయితే ఇప్పుడు ధోని–సీఎస్కే బంధంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న 45 ఏళ్ల ధోని.. సీఎస్కేలో వాటా కొనుగోలు చేయాలని భావించినట్లు సమాచారం. అయితే వాటా విషయంలో ధోని, సీఎస్కే యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి.
25 శాతం అడిగిన ధోని.. 3 శాతమే ఆఫర్?
ఈ విషయంపై విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. తొలుత సీఎస్కేలో 25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ధోని ఆసక్తి చూపించాడట. అయితే యాజమాన్యం మాత్రం అతడికి కేవలం 3 శాతం వాటా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ధోని తన డిమాండ్‌ను 20 శాతానికి తగ్గించినప్పటికీ.. సీఎస్కే ఆఫర్ 4 శాతానికి మాత్రమే పెరిగిందట. మరో విడత చర్చల్లో ధోని 18 శాతం వాటాకు అంగీకరించేందుకు సిద్ధమైనా.. యాజమాన్యం చివరకు 5.5 శాతం వాటా మాత్రమే ఆఫర్ చేసిందని ఓ కథనం పేర్కొంది.
అయితే ధోని, సీఎస్కే యాజమాన్యం మధ్య జరిగిన ఈ చర్చలన్నీ మాట పూర్వకంగానే జరిగాయని సమాచారం. ఇరు వర్గాల మధ్య ఎలాంటి అధికారిక రాతపూర్వక ప్రతిపాదన లేదా ఒప్పందం కాలేదని నివేదిక తెలిపింది. వాటా విషయంలో తలెత్తిన ఈ విభేదాలు ధోని–సీఎస్కే సంబంధాలపై ప్రభావం చూపినట్లు కూడా కథనం పేర్కొంది. అంతేకాకుండా.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే తరఫున ధోని మళ్లీ బరిలోకి దిగుతాడా? లేదా? అన్న దానిపైనా స్పష్టత లేదని తెలిపింది. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే ధోనిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే గాయం కారణంగా 2026 ఐపీఎల్ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్‌లోనూ సీఎస్కే తరఫున ఆడలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్
దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్