డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడింది: రాహుల్ ద్రవిడ్
ABN , Publish Date - Aug 25 , 2026 | 02:46 PM
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో టీమిండియా కాస్త వెనుకబడి ఉంది. ఇదే విషయంపై భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. 2025-27 సైకిల్‌లో మిగిలిన ఎనిమిది టెస్టుల్లో సుమారు ఆరు మ్యాచ్‌లు గెలిస్తేనే ఫైనల్ బెర్త్ కోసం భారత్‌కు అవకాశాలు మెరుగుపడతాయి. వచ్చే ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ టీమిండియాకు అత్యంత కీలకం. అయితే ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం జట్టు కాస్త వెనుకబడింది. అయినా భారత జట్టులో ఉన్న నాణ్యమైన ప్లేయర్లను చూస్తే ఎప్పుడూ ఆ అవకాశాలను కొట్టిపారేయలేం. శ్రీలంకపై మంచి ఆరంభం లభించింది. ఇది తొలి అడుగు మాత్రమే. న్యూజిలాండ్‌లో ఆడటం ఎప్పుడూ సవాలే. అక్కడి పరిస్థితులు యువ భారత ఆటగాళ్లకు కొత్తగా ఉండొచ్చు. అందుకే ఆ సిరీస్ పెద్ద పరీక్ష కానుంది. రాబోయే నెలల్లో ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం, గాయాల బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం’ అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
భారత్‌పై ఆసీస్ కన్ను..
వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉందని ద్రవిడ్ చెప్పాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఆటగాళ్లు భారత్‌లో రాణించాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. గొప్ప ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఈ తరం జట్టు భారత్‌లో ఇప్పటివరకు సిరీస్ గెలవలేదు. కాబట్టి ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని వారు గట్టిగా ప్రయత్నిస్తారు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించగలిగితే ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. టీమిండియా దీన్ని సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నా’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్
దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. వీడియో వైరల్